Begin typing your search above and press return to search.

పెట్రో మంట .. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సీఎం మమత ప్రయాణం !

By:  Tupaki Desk   |   25 Feb 2021 10:34 AM GMT
పెట్రో మంట .. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సీఎం మమత ప్రయాణం !
X
దేశ వ్యాప్తంగా నిత్యం పెరగుతున్న ఇంధనధరలతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. దాదాపుగా పెట్రోల్ చాలా ప్రాంతాల్లో 100 చేరువకి వచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ ధరలు రేట్లు వాటితో పోటీ పడుతోన్నాయి. 10 రోజుల వ్యవధిలో వంటగ్యాస్ సిలిండర్ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 25 రూపాయల మేర పెరిగింది. ఈ ఒక్కనెలలోనే 100 రూపాయల మేర పెరిగింది పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్‌ను విధించడం వల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తు వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశారు. కోల్‌కతా రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్‌ పై ప్రయాణించారు. సామాన్యులు పెట్రోల్, డీజిల్ కొని రోడ్లపై తిరగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని గత కొన్నిరోజులుగా ఆమె విమర్శిస్తున్నారు. తాను నివసిస్తోన్న హరీష్ ఛటర్జీ మార్గ్ నుంచి సచివాలయం ఉన్న నిబానా వరకు ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్ ‌పై ప్రయాణించారు. పార్టీ సీనియర్ నాయకుడొకరు ఈ-బైక్‌ను నడిపిస్తోండగా.. ఆమె వెనుక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మెడలో ఓ బోర్డు కనిపించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా.. పేదవాడికి అందుబాటులో ఉండే కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టేశారని నిప్పులు చెరిగారు. ఈ వీడియోను మమత బెనర్జీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.