Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో టైట్ ఫైట్ తప్పదా ?

By:  Tupaki Desk   |   6 March 2023 3:00 PM GMT
ఉత్తరాంధ్రలో టైట్ ఫైట్ తప్పదా ?
X
ఈనెల 13వ తేదీన జరగబోతున్న ఉత్తరాంద్ర పట్టబధ్రుల ఎంఎల్సీ ఎన్నిక పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. వైసీపీ తరపున సీతంరాజు సుధాకర్, టీడీపీ తరపున చిరంజీవిరావు, బీజేపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంఎల్సీ పీవీఎన్ మాధవ్, పీడీఎఫ్ తరపున కోరెడ్ల రమాప్రభ పోటీచేస్తున్నారు. అభ్యర్ధుల పరంగా చూసుకుంటే నలుగురు గట్టి అభ్యర్ధులే అనటంలో సందేహంలేదు. అయితే పార్టీల పరంగా ఏమిటనేదే అందరిలోను సందేహాలు పెంచేస్తున్నాయి.

పార్టీపరంగా చూస్తే వైసీపీకి ప్లస్సులు, మైనస్సులు రెండూ ఉన్నాయి. అధికారంలో ఉండటం, నాలుగురు అభ్యర్ధులు రంగంలో ఉండటం బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ కు సానుకూలమనే చెప్పాలి. ప్రతిపక్షాల మధ్య ఓట్లు ఎంతగా చీలిపోతే అధికారపార్టీకి అంత కలిసొస్తుందన్నది అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, విశాఖపట్నమే రాజధానని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో తమ విజయం ఖాయమని వైసీపీ అనుకుంటోంది.

ఇక టీడీపీ తరపున పోటీచేస్తున్న చిరంజీవి రావుకు విద్యావేత్తగా పేరుంది. పైగా తమ సామాజికవర్గానికి చెందిన తూర్పుకాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది కాబట్టి తన గెలుపు ఖాయమని చిరంజీవి అనుకుంటున్నారు.

ఇక వెలమ సామాజికవర్గానికి చెందిన మాధవ్ అయితే చాలాకాలంగా తమ కుటుంబానికి ఉన్న మంచి సంబంధాలు, పేరు తన గెలుపుకు సహకరిస్తాయని అనుకుంటున్నారు. మాధవ్ తండ్రి పీవీ చలపతిరావుకు జనాల్లో మంచి పేరుంది. అదికూడా తనకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు.

ఇదే సమయంలో రమాప్రభ బలమంతా పీడీఎఫ్ఫే అనటంలో సందేహంలేదు. ఉత్తరాంధ్రలో మొదటినుండి పీడీఎఫ్ బలంగా ఉంది. రమాప్రభ వెలమ సామాజికవర్గం కాగా ఆమె భర్త గంగారావు యాదవ సామాజికవర్గానికి చెందిన నేత.

ఈ స్ధానంలో గతంలో పీడీఎఫ్ అభ్యర్ధులు చాలాసార్లు గెలిచున్నారు. కాబ్టటి సంప్రదాయంగా వస్తున్న ఓటుబ్యాంకే తనను గెలిపిస్తుందని ప్రభ దీమాగా ఉన్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ అయితే నలుగురి మధ్య మంచి రసవత్తరంగానే ఉంది. చివరకు ఫలితం ఎలాగుంటుందో అనేది సస్పెన్సుగా మారిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.