Begin typing your search above and press return to search.

చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు కుర్రాడ్ని పొట్టన పెట్టుకున్న గన్ కల్చర్

By:  Tupaki Desk   |   21 April 2023 10:13 AM GMT
చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు కుర్రాడ్ని పొట్టన పెట్టుకున్న గన్ కల్చర్
X
అమెరికాలో చోటు చేసుకున్న తాజా కాల్పుల ఉదంతంలో మరో ప్రాణం పోయింది. అయితే.. ఈసారి కాల్పులకు బలైంది తెలుగు ప్రాంతానికి చెందిన ఒక అమాయకుడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. ఒక పెట్రోల్ బంకులో పని చేస్తున్న వీర సాయిష్, అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మరణించాడు. దీంతో.. అతడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం అతడి కుటుంబం ఏలూరులో నివాసం ఉంటున్నారు. సాయిష్ ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఒక షెల్ గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. అమెరికాకాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి 12.50 గంట వేళలో గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్న వేళలో అక్కడకు వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మీద విచక్షణరహితంగా కాల్పులుజరిపి.. స్టేషన్ లో ఉన్న నగదును ఎత్తుకెళ్లిపోయారు.

ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన సాయిష్ ను ఓహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్ కు తరలించారు. వైద్యులు అతడికి చికిత్స చేస్తున్న సమయంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్ని గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సాయిష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నాలుగేళ్ల క్రితం సాయిష్ తండ్రి మరణించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సాయిష్ అసరాగా నిలుస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ కుటుంబం సమస్యల నుంచి బయటపడుతోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ లో ఉన్న అతడు.. మరికొద్దినెలల్లో తాను చేస్తున్న పెట్రోల్ బంకు ఉద్యోగాన్ని మానేద్దామని అనుకుంటున్నాడు.

ఇలాంటి వేళలో జరిగిన కాల్పుల్లో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన కొడుకు ఉదంతం గురించి తెలిసిన వారి కుటుంబం గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు.