Begin typing your search above and press return to search.

కీలక నియోజకవర్గంలో వైసీపీలో మూడు ముక్కలాట!

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:43 AM GMT
కీలక నియోజకవర్గంలో వైసీపీలో మూడు ముక్కలాట!
X
ఏపీలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సొంత ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. గుంటూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాటకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉయ్యూరు ఫౌండేషన్‌ అధినేత ఉయ్యూరు శ్రీనివాసరావును వసంత కృష్ణప్రసాద్‌ వెనకేసుకొచ్చారు. అంతేకాకుండా ఉయ్యూరు ఫౌండేషన్‌ పై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ నేతలను తప్పుబట్టారు.

వసంత కృష్ణప్రసాద్‌ తో పాటు ఆయన తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో ఒక్క కమ్మ మంత్రి కూడా లేరని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి పేరు మార్చినా పట్టించుకునేవారు లేరన్నారు. ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్‌ సీఎం జగన్‌ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్‌ కు మైలవరం సీటు దక్కదని టాక్‌ నడుస్తోంది. జగన్‌ మదిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు. వారిలో ఒకరు.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం. అలాగే మరొక వ్యక్తి.. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌.

వాస్తవానికి 2014లో జోగి రమేష్‌ మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2019లో దేవినేని ఉమాలాంటి బలమైన అభ్యర్థికి గట్టి అభ్యర్థి ఉండాలని కమ్మ సామాజికవర్గానికే చెందిన వసంత కృష్ణప్రసాద్‌ ను బరిలో దించారు. ఈ ప్రయోగం ఫలించి వసంత కృష్ణప్రసాద్‌ గెలుపొందారు. 2009, 2014ల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన దేవినేని ఉమా 2019లో ఓడిపోవాల్సి వచ్చింది.

అయితే ఈసారి వసంత కృష్ణప్రసాద్‌ పోటీకి నిరాసక్తత చూపిస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి జోగి రమేష్‌ తమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. పెడనలో ఈసారి జోగి రమేష్‌ ఓడిపోవడం ఖాయమని టాక్‌ నడుస్తోంది. పెడనలో కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికం. 40 వేలకు పైగా ఓటర్లు కాపులే. జోగి రమేష్‌ తరచూ పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర దూషణలకు పాల్పడటంపై కాపు సామాజికవర్గం జోగిపై ఆగ్రహం ఉందని అంటున్నారు. మరోవైపు తరచూ తమపై తీవ్ర విమర్శలు చేస్తున్న జోగి రమేష్‌ ను ఓడించాలని టీడీపీ కూడా గట్టి కంకణం కట్టుకుంది.

ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ మైలవరం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. తాను లేదంటే తన కుమారుడు పోటీకి వీలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మండిపడుతున్నారు. వైసీపీ అధిష్టానానికే నేరుగా మంత్రి జోగిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మైలవరంలో తలశిల రఘురాం, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.