Begin typing your search above and press return to search.

మంత్రి పెద్దిరెడ్డి విషయంలో ఎస్‌ఈసీ ఆదేశాలపై డీజీపీ స్పందన ఇదే

By:  Tupaki Desk   |   6 Feb 2021 10:30 AM GMT
మంత్రి పెద్దిరెడ్డి విషయంలో ఎస్‌ఈసీ ఆదేశాలపై డీజీపీ స్పందన ఇదే
X
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మరో రచ్చకు తెరలేపారు ఎస్ ఈసీ నిమ్మగడ్డ. ఏకంగా మంత్రిపైనే చర్యలు తీసుకోవడంతో దుమారం రేగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను భయపెడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..ఆయన్ను ఎన్నికలు ముగిసే వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ కు ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని బయటికి అనుమతించవద్దని, మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంపై తనకు ఎన్నికల కమిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదేశాలు వచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. అయితే పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తుండటం విచారకరమని గౌతం సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకే తాము అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని డీజీపీ హెచ్చరించారు. తాను రాజకీయాలు మాట్లాడను, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ అన్నారు.

ఇదిలా ఉంటే .. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చేస్తూ ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. హైకోర్టుకు నేడు, రేపు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ వేయాలని భావిస్తోంది.