Begin typing your search above and press return to search.

ఆ ఊరిలో ఇదేం విచిత్రం: టికెట్లు కొంటారు... కానీ రైలెక్కరు!

By:  Tupaki Desk   |   9 March 2023 1:00 PM GMT
ఆ ఊరిలో ఇదేం విచిత్రం: టికెట్లు కొంటారు... కానీ రైలెక్కరు!
X
సాధారణంగా రైలు ప్రయాణం అంటే టికెట్లు తీసుకునేవారు ఎంత మంది ఉంటారో.. టికెట్లు తీసుకోకుండా ఎక్కేవారు కూడా అలాగే ఉంటారు. టికెట్లు లేకుండా దొంగ ప్రయాణాలు చేసేది రైళ్లలోనే ఎక్కువ. కానీ.. విచిత్రంగా అసలు రైలు ఎక్కకపోయినా కూడా కొంత మంది టికెట్స్‌ తీసుకుంటున్నారు. ఏంటి నమ్మడం లేదా.. అయితే రండి.. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ సమీపంలో ఉన్న దయాల్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ కు వెళ్దాం...

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ సమీపంలో ఉన్న దయాల్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ను 1954లో నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత ప్రయాణికులు లేకపోవడంతో ఈ స్టేషన్‌ కు ఆదాయం పడిపోయింది. దీంతో 2006లో దీన్ని రైల్వే అధికారులు మూసేశారు.

ఈ క్రమంలో తమ గ్రామంలో రైల్వే స్టేషన్‌ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్‌ పూర్‌ ప్రజలు అనేక పోరాటాలు చేశారు. 2006లో మూతపడినప్పటి నుంచి మళ్లీ రైల్వే స్టేషన్‌ ను ఓపెన్‌ చేయాలని పోరాటం చేస్తూ వచ్చారు. దీంతో అధికారులు 2022 జనవరిలో దయాల్‌ పూర్‌ స్టేషన్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు టికెట్లు బాగానే అమ్ముడుపోయాయి. ఆ తర్వాత మళ్లీ టికెట్ల అమ్మకాలు పడిపోయాయి.

దీంతో దయాల్‌ పూర్‌ నివాసుల్లో ఆందోళన నెలకొంది. ఇన్నేళ్లు కష్టపడి.. తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్‌ మళ్లీ మూతపడితే తాము ఇబ్బందులు పడతామని ఆలోచించారు. టికెట్ల విక్రయం తగ్గిపోవడంతో ఆదాయం తగ్గి స్టేషన్‌ మూతపడకుండా ఉండేందుకు గ్రామస్థులు ప్రయాణాలు చేయకపోయినా టికెట్లు కొనాలని నిర్ణయించారు. 2022 డిసెంబర్‌ వరకు నెలకు సుమారు 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ 2023 ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీంతో దయాల్‌ పూర్‌ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారు. స్టేషన్‌ ఆదాయం తగ్గిపోయినప్పుడల్లా టికెట్లు కొంటూ వస్తున్నారు. కానీ.. ప్రయాణం మాత్రం చేయరు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.