Begin typing your search above and press return to search.

మండే ఎండల్లో వేసవి విడికి ఈ దేశాలకే భారతీయుల ఫేవరెట్స్

By:  Tupaki Desk   |   17 May 2023 7:00 PM GMT
మండే ఎండల్లో వేసవి విడికి ఈ దేశాలకే భారతీయుల ఫేవరెట్స్
X
ఎండలు మండుతున్నాయి. మరో రెండు నుంచి మూడు వారాల పాటు ఇదే తీరుతో వేసవి తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొత్తం పూర్తి కావటం.. రిజల్ట్ వచ్చేస్తున్న నేపథ్యంలో వేసవి నుంచి రిలీఫ్ కోసం చల్లని ప్రదేశాలకు టూర్ కు వెళ్లొద్దామన్న ప్లాన్ చేస్తున్నారు. మరి.. మనోళ్ల ఛాయిస్ లో ఏ ప్రాంతాలు ఉన్నాయి? అన్న అంశంపై ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ అయిన థామస్ కుక్ (ఇండియా).. ఎస్ ఓటీసీ ట్రావెల్ విడుదల చేసిన ఇండియా హాలిడే రిపోర్టు వివరాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ నివేదికలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా చాలాకాలంగా ఆగిపోయిన నేపథ్యంలో ఖర్చు గురించి పెద్దగా ఆలోచించటం లేదని చెబుతున్నారు. మెజార్టీ ప్రజలు సులువుగా వీసాలు పొందే వీలున్న విదేశీ ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన వేసవి విడిదిగా యూరోప్ నిలుస్తోంది. స్విట్జర్లాండ్.. ప్రాన్స్.. స్పెయిన్.. ఇటలీ దేశాలకు ప్రాధాన్యత క్రమంలో టాప్ ప్లస్ లో నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాలకే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దూర ప్రాంతాలు.. భారీ బడ్జెట్ ను భరించలేని వారు మాత్రం థాయ్ లాండ్.. సింగపూర్.. మలేషియా.. ఇండోనేషియా.. దుబాయ్.. అబుదాబి.. ఒమన్.. మల్దీవులు.. మారిషస్ లాంటి ద్వీపాల్లో సేద తీరేందుకు వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మధ్యన మారిన ట్రెండ్ కు అనుగుణంగా జపాన్.. దక్షిణ కొరియా దేశాలకు కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే అమెరికాకు వెళ్లే కన్నా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్లుగా ఈ రిపోర్టు పేర్కొంది. వీసాలు పొందటంలో ఉన్న ఇబ్బంది కూడా దీనికో కారణంగా చెబుతున్నారు.

విదేశీ ప్రయాణాలు కాదు.. స్వదేశంలో అంటే మాత్రం అందరి చాయిస్ కశ్మీర్ కేనని చెబుతున్నారు. కశ్మీర్ తర్వాత హిమాచల్ ప్రదేశ్.. ఉత్తరాఖండ్.. లద్దాఖ్.. ఈశాన్య ప్రాంతాలతో పాటు కేరళ.. అండమాన్.. గోవాతో పాటు భూటాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. మినీ మెట్రో నగరాల్లో చేసిన సర్వేలో తేలిన మరో అంశం ఏమంటే.. 40 శాతం మంది దేశీయ వేసవి విడిదులకు వెళ్లేందుకు మొగ్గు చూపుగా.. 60 శాతం మంది విదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తేలింది.