Begin typing your search above and press return to search.

అధినేతలు ఎంతమంది ఉన్నా.. పవన్ కు సాటి వచ్చే వారే లేరు!

By:  Tupaki Desk   |   23 Feb 2023 11:00 PM GMT
అధినేతలు ఎంతమంది ఉన్నా.. పవన్ కు సాటి వచ్చే వారే లేరు!
X
డబ్బులు సంపాదించటం ఒక ఎత్తు. దాన్ని ఖర్చు చేయటం మరో ఎత్తు. తాము సంపాదించిన దాన్ని రెట్టింపు చేయటమే తప్పించి.. పక్కనోళ్లకు ఇవ్వటానికి సుతారం ఇష్టపడని ప్రముఖుల్ని చూస్తాం. మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయ పార్టీ అధినేతల తీరు భిన్నంగా కనిపిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే కాదు.. రెండు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల అధినేతలు సైతం తమ ఆస్తుల నుంచి డబ్బులు తీసి ఇచ్చే ధోరణి పెద్దగా కనిపించదు.

అందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపిస్తారు. ఈ మధ్యన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ వారికి ఆర్థికంగా చేయూతను ఇవ్వటం తెలిసిందే. నిజానికి ఇలాంటి విషయాల్లో మిగిలిన అధినేతలతో పోలిస్తే పవన్ కల్యాణ్ చాలా ముందుంటారు. చాలామంది అధినేతలు పరామర్శలకు వెళతారే తప్పించి.. వారికి ఆర్థిక సాయం గురించి పెద్దగా ఆలోచించరు. కానీ.. జనసేనాని మాత్రం అందుకు భిన్నం. ఆయన సంపాదనలో అత్యధికం దానధర్మాలకు.. ఎవరికైనా సాయం చేసేందుకు ఇస్తారన్నది తెలిసిందే.

తాజాగా పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తన వంతుగా రూ.కోటి మొత్తాన్ని విరాళం ఇచ్చారు పవన్ కల్యాణ్. ఈ భారీ మొత్తంతో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా.. ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకురూ.50 వేలు బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంనున పవన్ తన జేబు నుంచి చెల్లించటం గమనార్హం.

గత ఏడాది కూడా ఆయన ఇదే విధంగా చెల్లించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ.. పక్కనున్న రాష్ట్రాల్లోనూ పలువురు అధినేతలు ఉన్నారు. వారిలో చాలామందికి పెద్ద ఎత్తున వ్యాపారాలు.. వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వారితో పోలిస్తే పవన్ కల్యాణ్ ఆస్తులు.. ఆదాయం తక్కువనే చెప్పాలి. కానీ.. ఆయన మాత్రం తనకు ఉన్న దాన్లో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని తనను నమ్ముకున్న వారికి తిరిగి ఇచ్చేసే విషయంలో ముందుంటారని చెప్పాలి. తాను సంపాదించే దానిలో అధిక మొత్తాన్ని తనను నమ్ముకున్న వారి కోసం ఖర్చు చేయటంలో పవన్ కు సాటి వచ్చే వారు మరెవరూ ఉండరని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.