Begin typing your search above and press return to search.

వీరు దొంగ‌లు కాదు...దేశ‌ముదుర్లు!

By:  Tupaki Desk   |   12 Sep 2018 10:28 AM GMT
వీరు దొంగ‌లు కాదు...దేశ‌ముదుర్లు!
X
పాత‌బ‌స్తీలోని నిజాం మ్యూజియంలో ఈ నెల 3వ తేదీన సినీ ఫ‌క్కీలో జ‌రిగిన దొంగ‌త‌నం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. మస్రత్‌ మహల్‌ లో ఉన్న‌ నిజాం మ్యూజియంలో నిజాంకు చెందిన బంగారు టిఫిన్‌ బాక్స్ - కప్పు - సాసర్ - స్ఫూన్‌ ల‌ను ఇద్ద‌రు దొంగ‌లు అత్యంత చాక‌చ‌క్యంగా కొల్ల‌గొట్టిన వైనం చూసి పోలీసులు విస్తుపోయారు. పాత బ‌స్తీకి చెందిన ఇద్ద‌రు దొంగ‌లు ప‌క్కాగా రెక్కీ నిర్వ‌హించి....మార్కింగ్ లు పెట్టుకుని ఈ దొంగ‌త‌నం చేసిన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆ దొంగ‌త‌నం చేసిన గౌస్‌ పాషా - మొబిన్ లను సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పక్కా హ్యూమన్‌ ఇంటెలిజెన్స్ ను ఉప‌యోగించుకొన్నార‌ని పోలీసులు తెలిపారు.

మ్యూజియం భ‌వ‌నంపై వేసుకున్న మార్కింగ్స్‌ ను బట్టి తాపీ పని ,సెంట్రింగ్‌ పని చేసే వారే ఈ ప‌ని చేసి ఉంటార‌ని పోలీసులు భావించారు. సీసీ కెమెరాల్లో చిక్కిన సన్నగా ఉన్న వ్యక్తి తో పాటు మ‌రో వ్య‌క్తి కోసం గాలించారు. అయితే, ఆ దొంగ‌లిద్ద‌రూ....అంత‌ర్జాతీయ స్థాయి దొంగ‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా స్కెచ్ వేశారు. పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు నానా తిప్ప‌లు ప‌డ్డారు. సిమ్‌కార్డు లేని సెల్ తో ఫోన్ మాట్లాడుతున్నట్లు బిల్డ‌ప్ ఇచ్చి పోలీసుల్ని తప్పుదారి పట్టించారు. మాస్క్‌ లు - గ్లౌజ్‌ లు వేసుకుని వేలిముద్రలు పడకుండా జాగ్రత్త ప‌డ్డారు. దొంగ‌త‌నం చేసిన త‌ర్వాత కావాల‌నే.....గంగానాల - ముర్గీచౌక్‌ మీదుగా ముంబై హైవే వైపు వెళ్లి పోలీసుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించారు. ముంబై వెళ్లినట్లు బిల్డ‌ప్ ఇచ్చిన వారు....ముత్తంగి వద్ద ఓఆర్ ఆర్‌ సర్వీస్‌ రోడ్ నుంచి సిటీకి వచ్చారు. ఆ త‌ర్వాతి రోజు జహీరాబాద్‌ వరకు బైక్ పై వెళ్లి....అక్క‌డ నుంచి బస్సులో ముంబై చేరుకుని టిఫిన్ బాక్స్ - వ‌స్తువులు బేరం పెట్టారు. అయితే, అక్క‌డ బేరం కుద‌ర‌క‌పోవ‌డంతో నిందితుల్లో ఒక‌రైన గౌస్ ప్లాన్ బీ అమ‌లు చేయాల‌నుకున్నాడు. 2011 నుంచి 25 నేరాలు చేసిన గౌస్ వాటిలో ఏదో ఒక‌దానిపై జైలుకు వెళ్లి దాక్కోవాల‌నుకున్నాడు.

మ‌రోప‌క్క వీరికోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. సీసీ కెమెరాలతో పాటు హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ను వాడారు. నేరం జరగడానికి ముందు...తర్వాత రోజుల్లో జారీ అయిన ఈ–చలాన్ ల డేటాను పరిశీలించారు.ఈ క్ర‌మంలోనే నేరం చేసినప్పటి దుస్తులే ధరించిన అనుమానితులు పోలీసుల‌కు చిక్కారు. ఆ వాహనం నెంబర్ తో అడ్ర‌స్ క‌నుగొన్నారు. ‘సెంట్రింగ్‌ పని చేసే గౌస్‌ కొన్ని రోజులుగా కనిపించట్లేదని పోలీసుల‌కు వారి సౌర్స్ లు సమాచారమిచ్చారు. సెంట్రింగ్‌ పని వారిపై అనుమానం...గౌస్ అదే ప‌నిచేయ‌డం....చ‌లాన్ లో దొర‌క‌డంతో వారే దొంగ‌ల‌ని నిర్ధారించి మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు. టిఫిన్ బాక్స్ లో ఆ ఇద్ద‌రుదొంగ‌లు అన్నం తిన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. మ‌రోవైపు, దేశంలో జ‌రిగిన మ్యూజియం దొంగ‌త‌నాల్లో ఇదు అతిపెద్దది కావ‌డం విశేషం. ప్యారిస్‌ మ్యూజియం - యూరప్‌ వెన్‌ గావ్‌ మ్యూజియం - బోస్టన్‌ మ్యూజియంలతో చాలా చోట్ల జ‌రిగిన దొంగ‌తనం కేసులు కూడా ఇంత త్వరగా సాల్వ్ కాలేదు. దీంతో, తెలంగాణ పోలీసుల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అంత‌కుముందు, ఈ నెల 3న ఆ ఇద్ద‌రు దొంగ‌లు సినీ ఫ‌క్కీలో దొంగ‌త‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. దొంగ‌త‌నం చేసేముందు ఆ ఇద్ద‌రు దొంగ‌లు ప‌క్కాగా రెక్కీ నిర్వ‌హించి....మార్కింగ్ లు పెట్టుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆ టిఫిన్ బాక్స్ ఉన్న గ్యాలరీలో దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్‌ పెట్టుకొని ప‌క్కా స్కెచ్ వేసిన‌ట్లు గుర్తించారు. మ్యూజియంపైకి ఏ విధంగా ఎక్కాలి....ఆ మార్కింగ్ వేసిన ద‌గ్గ‌ర నుంచి లోప‌లికి ఎలా దిగాలి....ఆ గ్యాల‌రీ ఉన్న వెంటిలేటర్ వద్దకు ఎలా వెళ్లాలి... సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి....ఇలా అన్ని విష‌యాలు క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాతే దొంగ‌త‌నం చేశారు.మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పై కప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు. అంత‌కుముందు చేసిన మార్క్‌ ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. ప్రత్యేక గమ్‌ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టి....ఇనుప గ్రిల్‌ కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ ను అడ్డం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఆ త‌ర్వాత‌ తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఒక దొంగ‌ ప్ర‌వేశించాడు. బంగారం టిఫిన్‌ బాక్స్‌ ఉన్న ర్యాక్ అద్దాలు ప‌గ‌ల‌కుండా....చిన్న రాడ్ సాయంతో వాటి త‌లుపు బోల్ట్‌లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్‌ బాక్స్ - టీ కప్పు - సాసర్ - స్పూన్‌ తీసుకుని తన బ్యాగ్‌ లో సర్దుకుని జారుకున్నారు.