Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో వారి పోరాటం రెండో స్థానం కోసమే!

By:  Tupaki Desk   |   31 March 2021 2:30 AM GMT
తిరుప‌తిలో వారి పోరాటం రెండో స్థానం కోసమే!
X
'100% ల‌వ్' అనే సినిమాలో ఓ పాయింట్ ఉంటుంది. కాలేజీలో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయంటే.. సెకండ్ ర్యాంక్ కోసం పోటీ నెల‌కొంటుంది. విద్యార్థులంతా సెకండ్ ర్యాంక్ ఎవ‌రికి వ‌స్తుందా? అని చ‌ర్చించుకుంటారు. అంతేకాదు.. సెకండ్ ర్యాంక్ వ‌చ్చిన వారు సంబ‌ర‌ప‌డిపోయి క్లాస్‌మేట్స్ కు పార్టీకూడా ఇస్తారు. ఇప్పుడు తిరుప‌తి లోక్ స‌భ స్థానానికి జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిలో సేమ్ సీన్ కనిపిస్తోంది!

అక్క‌డ అధికార వైసీపీ విజ‌యం దాదాపుగా ఖ‌రారైపోయిందనే ప్ర‌చారం సాగుతోంది. మెజారిటీ 4 ల‌క్ష‌లు వ‌స్తుందా? ఐదు ల‌క్ష‌లా? అన్న‌దే తేలాల్సి ఉంద‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో విప‌క్షాల‌న్నీ తెగ హ‌డావిడి చేస్తున్నాయి. ఎందుకోస‌మంటే.. సెకండ్ ప్లేస్ కోసం అంటున్నారు విశ్లేష‌కులు! జ‌నాల్లో కూడా ఇదే ర‌క‌మైన చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. వైసీపీ గెలుపు ఖాయ‌మైన చోట‌.. రెండో స్థానం కోస‌మే ప్ర‌తిప‌క్షాలు పోటీ ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు.. నామం బొట్టు అన్న చందంగా మారిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, మునిసిప‌ల్ పోరులో ప్ర‌జ‌లు క్లియ‌ర్ గా చాటిచెప్పారు.. తాము వైసీపీ ప‌క్ష‌మే అని! పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో దాదాపు 85 శాతానికి పైగా వైసీపీ మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించ‌గా.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఏకంగా 90 శాతం స్థానాల్లో అధికార పార్టీ అభ్య‌ర్థులు గెలుపు జెండా ఎగ‌రేశారు.

దీంతో.. టీడీపీ ఆశ‌లు ఆవిరైపోయాయి. ఇప్పుడు తిరుప‌తి ఎన్నిక‌లోనూ ఇదే ఫ‌లితం పున‌రావృతం అవుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ది కాబ‌ట్టి.. వైసీపీకి పోటీ తామే అని చాటుకోవాలంటే.. తిరుప‌తిలో రెండో స్థానంలో నిల‌వ‌డం టీడీపీకి అనివార్యం. లేదంటే.. జ‌నాల్లో ప్ర‌తిష్ఠ దారుణంగా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది.

అటు బీజేపీ-జ‌న‌సేన కూడా రెండో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తోంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో తామే ప్ర‌త్యామ్నాయం అని చాటుకోవాలంటే.. రేపు జ‌నానికి చెప్పుకోవాలంటే.. ఇక్క‌డ రెండో స్థానంలో నిల‌వ‌డం కంప‌ల్స‌రీ. త‌ద్వారా.. త‌మ బ‌లం మ‌రింత పెరిగింద‌ని చెప్పుకోవాల‌నేది ఆ కూట‌మి ప్ర‌య‌త్నంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను కూల్ చేశార‌ని అంటున్నారు. తిరుప‌తి సీటుకోసం జ‌న‌సేన ఎంత‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. బీజేపీ అధిష్టానం స‌సేమిరా అన్న‌ది. దీంతో.. జ‌న‌సైనికుల్లో అసంతృప్తి నెల‌కొంది. దాన్ని చ‌ల్లార్చేందుకే ఈ ప్ర‌క‌ట‌న అని అంటున్నారు విశ్లేష‌కులు.

అయితే.. ఓటింగ్ బ‌లాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. టీడీపీకి రెండో స్థానం వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. బీజేపీ-జ‌న‌సేన కూట‌మికి 3 నుంచి 5 శాతం ఓట్లు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఏం చేసైనా రెండో స్థానంలోకి రావాల‌ని ఆ కూట‌మి ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా పున‌రుజ్జీవ‌నం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. గతమెంతో ఘనం అన్న రీతిలో పలుమార్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన చింతా మోహన్ నే నమ్ముకుంది. ఆయన ద్వారా మెరుగైన ఓటింగ్ సాధించి రెండో స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తోందట. మొత్తంగా.. తిరుపతిలో విజయం తమదేనని విపక్షాలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. అంతర్గత లక్ష్యం మాత్రం రెండో స్థానం కోసమేనని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి, ప్రజలు ఆ స్థానాన్ని ఎవరికి కట్టబెడతారో చూడాలి.