Begin typing your search above and press return to search.

ఒకే వ్యక్తి ఒక రోజే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం .. ఏమైంది!

By:  Tupaki Desk   |   23 Jan 2021 7:34 AM GMT
ఒకే వ్యక్తి ఒక రోజే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం .. ఏమైంది!
X
ఓ వ్యక్తి ఒకే రోజు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్రకలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పిలివలస ప్రాంతానికి చెందిన గణపతి భార్య చనిపోయింది. దీనితో పిల్లలతో కలిసి తాటిచెట్లపాలెం ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. బుచ్చిరాజుపాలెంలోని ఓ కర్రీ పాయింట్‌ లో పనిచేస్తున్నాడు.

శుక్రవారం కర్రీపాయింట్‌ నిర్వాహకులతో గొడవ జరగడంతో స్వగ్రామానికి వెళ్తూ కొత్తవలసలో బస్సు దిగిపోయాడు. నిర్వాహకులు ఏమైనా చేస్తారనే భయంతో రెండు చేతులపై కోసుకుని వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశాడు. స్థానిక కానిస్టేబుల్‌ సురేష్‌ అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చేయించారు. ఆ తర్వాత పిల్లలకు వద్దకు తీసుకెళ్లి అప్పగించారు.

ఇదిలా ఉండగానే , శుక్రవారం రాత్రి కంచరపాలెం పోలీస్ స్టేషన్‌ వద్దకు గణపతి వెళ్లాడు. అక్కడ కొంతసేపు ఒంటరిగా కూర్చున్నాడు. అనంతరం అటువైపు వచ్చిన కొందరు గొంతుకోసుకొని తీవ్ర రక్తస్రావంలో ఉన్న గణపతిని చూసి కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కృష్ణారావు, ఎస్‌.ఐ. లోకేష్‌ అతన్ని కేజీహెచ్‌ కు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గొంతుపై లోతుగా గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. అయితే , ఆ వ్యక్తి ఒకే రోజు రెండుసార్లు ఆత్మహత్య కి పాల్పడటానికి అసలు కారణం ఏంటి అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గణపతి కంచరపాలెం పోలీసుస్టేషన్‌ వద్దకు ఎందుకు వచ్చింది తెలియడం లేదని సీఐ కృష్ణారావు తెలిపారు.