Begin typing your search above and press return to search.

జ‌నాలు స‌రే.. మ‌ళ్లీ టీడీపీకి అదే డౌట్‌?!

By:  Tupaki Desk   |   20 April 2023 1:00 PM GMT
జ‌నాలు స‌రే.. మ‌ళ్లీ టీడీపీకి అదే డౌట్‌?!
X
టీడీపీకి మ‌ళ్లీ కొన్ని పాత డౌట్లే కొత్త‌గా త‌గులుకున్నాయి. ప్ర‌స్తుతం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎక్క‌డ ప‌ర్య టిస్తున్నా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆయ‌న‌ను చూసేందుకు ఆయ‌న చెప్పేది వినేందుకు తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. చంద్ర‌బాబు చెప్పింది ఆసాంతం వింటున్నారు. జేజేలు కొడుతున్నారు. ఈల‌లు వేస్తున్నారు చంద్ర‌బాబు ఇచ్చిన నినాదాలు సైతం ప‌లుకుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట తూర్పుగోదావ‌రిలో నిర్వ‌హించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు.

దీంతో రోడ్ల‌న్నీ కూడా నిండిపోవ‌డంతో రోడ్ షో కేవ‌లం కిలో మీట‌రు దూరానికి నాలుగు గంట‌లు ప‌ట్టిం ది. ఇక‌, ఇప్పుడు తాజాగా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రోడ్‌లోనూ. రెండు కిలో మీట‌ర్ల దూరా న్ని దాటుకుని వెళ్లేందుకు క‌నీసం 3 గంట‌ల‌కు పైగానే ప‌ట్టింది. అంటే ఇస‌కేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు క్యూకట్టారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం పొంగింద‌నే చెప్పాలి. అయితే అదేస‌మ‌యంలో టీడీపీకి మ‌రో చింత కూడా ప‌ట్టుకుంది.

2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలానే ప్ర‌జ‌లు పోటెత్తారు. టీడీపీ పాల‌న‌పై వారి హ‌ర్షం తెలియ‌చేస్తూ సెల్‌ఫోన్ల‌లోని టార్చ్‌ను వెలిగించి హ‌ర్షం తెలిపారు. చ‌ప్ప‌ట్లు కొట్టారు సీనంతా సేమ్ టు సేమ్‌. ఇక‌, మ‌హిళ‌లు అయితే చంద్ర‌బాబు పై పాట‌లు పాడారు. దీంతో ఇంకేముంది పార్టీ విజ‌యం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబున‌మ్మారు. అదే చెప్పారు. గెలుపు త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

కానీ, తీరా ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేస‌రికి అంతా రివ‌ర్స్ అయిపోయింది. చంద్ర‌బాబు ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. వాస్త‌వానికి ఎన్నిక‌ల రోజు కూడా.. అర్ధ రాత్రి వ‌ర‌కు చాలా చోట్ల ప్ర‌జ‌లు క్యూల‌లో నిల‌బ‌డి.. ఓటు వేశారు. ఇది కూడా తామిచ్చిన ప‌సుపు-కుంకుమ ఎఫెక్టేన‌ని అనుకున్నారు. కానీ, రిజ‌ల్ట్ రోజు మాత్రం రివ‌ర్స్ అయింది. దీంతో ఇప్పుడు వ‌స్తున్న జ‌నాభా రేపు ఓట్లు వేసేలా మ‌లుచుకోవ‌డం పై ఎలా దృష్టిపెట్టాల‌నే దానిపై నాయ‌కులు మేధోమ‌థ‌నం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.