Begin typing your search above and press return to search.

టాప్ త్రీ సంప‌న్న అభ్య‌ర్థుల్లో ఇద్ద‌రు తెలంగాణ వారే!

By:  Tupaki Desk   |   14 May 2019 5:17 AM GMT
టాప్ త్రీ సంప‌న్న అభ్య‌ర్థుల్లో ఇద్ద‌రు తెలంగాణ వారే!
X
ఏడు ద‌శ‌ల్లో సుదీర్ఘంగా సాగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో అన్ని పార్టీల‌తో క‌లిసి 8049 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వీరంద‌రిలో అత్యంత ధ‌నిక ఎంపీ అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న ఆస‌క్తిక‌ర విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నేష‌న‌ల్ ఎల‌క్ష‌న్ వాచ్.. అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రీఫార్మ్స్ (పొట్టిగా చెప్పాలంటే ఏడీఆర్) సంస్థ‌లు భారీ క‌స‌ర‌త్తునే చేశాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు (7928 మంది) నామినేష‌న్ సంద‌ర్భంగా దాఖ‌లు చేసే అఫిడ‌విట్ల‌ను లోతుగా విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాల్ని బ‌య‌ట‌పెట్టారు.

ఎంపీ అభ్య‌ర్థులుగా బ‌రిలో ఉన్న వారిలో అత్యంత ధ‌నికుడైన అభ్య‌ర్థి బిహార్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్య‌ర్థి కావ‌టం విశేషం. ఇక‌.. రెండు.. మూడు స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావ‌టం గ‌మ‌నార్హం. బిహార్ కు చెందిన ఆర్కే శ‌ర్మ (రూ. 1,107 కోట్లు) అత్యంత‌ ధ‌నిక అభ్య‌ర్థిగా తేలారు. రెండో స్థానంలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి (రూ.895 కోట్లు)నిల‌వ‌గా.. మూడో స్థానంలో కొండాపై పోటీ చేసిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి నిల‌వ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

లోక్ స‌భ‌కు పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో కోటీశ్వ‌రుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. 2009లో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల్లో కోటీశ్వ‌రులు 16 శాతం ఉంటే.. 2014 నాటికి అది 27 శాతానికి పెరిగింది. తాజా ఎన్నిక‌ల్లో అది మ‌రో రెండు శాతం పెరిగి 29 శాతానికి చేరింది. రాష్ట్రాల వారీగా చూసిన‌ప్పుడు అభ్య‌ర్థుల్లో కోటీశ్వ‌రులు అత్య‌ధికులు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన వారు కావ‌టం విశేషం. ఈ రాష్ట్రంలో బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల్లో 83 శాతం మంది కోటీశ్వ‌రులే. త‌ర్వాతి స్థానంలో మేఘాల‌య 78 శాతం.. మిజోరం 67 శాతం.. నాగాలాండ్‌.. డామ‌న్ అండ్ డ‌య్యూ.. ల‌క్ష‌ద్వీప్.. గోవాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 50 శాతం కోటీశ్వ‌రులే. జ‌మ్ముక‌శ్మీర్ లో 48 శాతం ఉండ‌గా.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో 47 శాతం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 42 శాతం అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులుగా తేలారు.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే..దేశం మొత్తంమీద అత్యంత ధనిక అభ్య‌ర్థుల్లో టాప్ త్రీ తీస్తే.. వారిలో ఇద్ద‌రు తెలంగాణ రాష్ట్రంలో బ‌రిలో ఉన్న వారు కాగా.. మొత్తం అభ్య‌ర్థుల్లో కోటీశ్వ‌రుల ఎంత‌మంది అన్న శాతం లెక్క‌ల్లో మాత్రం తెలంగాణ చివ‌రి స్థానంలో నిలిచింది. పార్టీల వారీగా చూస్తే.. బీజేపీ అభ్య‌ర్థుల స‌గ‌టు ఆస్తి రూ.13.37 కోట్లుగా ఉంటే.. కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఆస్తి స‌గ‌టున రూ.19.92 కోట్లు.. బీఎస్పీ స‌గ‌టు రూ.3.86 కోట్లు.. సీపీఎం స‌గ‌టు రూ.1.28 కోట్లు.. ఇండిపెండెంట్ల స‌గ‌టు రూ.1.25 కోట్లుగా ఉంది.