Begin typing your search above and press return to search.

రూ.2.6వేల కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది రూ.1 వెయ్యి!

By:  Tupaki Desk   |   4 Feb 2021 7:10 AM GMT
రూ.2.6వేల కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చింది రూ.1 వెయ్యి!
X
కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ కి మరోసారి మొండిచేయి చూపించింది. ముఖ్యంగా బడ్జెట్ లో రైలు మార్గాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యే చూపించింది. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి కేంద్రం గత సంవత్సరంలో ఇచ్చింది వెయ్యి రూపాయలు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరోసారి ఆ వెయ్యి రూపాయలే కేటాయించారు.

వివరాల్లోకి వెళ్తే ... 106 కి.మీ. నిడివి కలిగిన ఈ లైను అంచనా వ్యయం రూ. 2,679 కోట్లు. దీనికి ఇప్పటివరకూ కేవలం రూ.2.20 కోట్లే ఖర్చుచేశారు. కానీ , గత ఏడాది బడ్జెట్ లో వెయ్యి , ఈ బడ్జెట్ లో మరో వెయ్యి ఇలా కేటాయిస్తూ పోతే , ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సిద్దమైయ్యేలోపు కలికాలం కూడా అంతం అయిపోతుంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటయ్యే అవకాశాలు ఈ ఏడాదీ కనిపించట్లేదు. తాజా బడ్జెట్‌లో దీని కోసం నిధులేమీ కేటాయించలేదు. కనీసం ఈ జోన్‌ ప్రస్తావన కూడా బడ్జెట్‌లో చేయలేదు. ఇప్పటికే కొనసాగుతున్న కొన్ని జాతీయ ప్రాధాన్యమున్న, అనుసంధాన అవసరాలున్న ప్రాజెక్టులకు మాత్రం సంతృప్తికరంగానే కేటాయింపులు చేశారు. ప్రధానంగా నడికుడి-శ్రీకాళహస్తి లైను నిర్మాణానికి రూ.1,144 కోట్లు, విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను నిర్మాణానికి రూ.800 కోట్లు, కాజీపేట-విజయవాడ మూడో లైను విద్యుదీకరణకు రూ.300 కోట్లు కేటాయించారు. జోన్లవారీ బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి రైల్వే శాఖ బుధవారం రాత్రి పింక్‌ బుక్‌ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ కు మొత్తం రూ.5,812 కోట్లు కేటాయించారు.