Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయం మహా రంజుగా ఉందిగా!

By:  Tupaki Desk   |   11 Feb 2023 10:00 AM GMT
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయం మహా రంజుగా ఉందిగా!
X
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్‌ రాజకీయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గతంలో చీరాల నుంచి 2009, 2014ల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రంగ ప్రవేశం చేసిన ఆమంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నవోదయం అనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిపై పోటీ చేసి గెలిచారు. 2015లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గాలిలోనూ చీరాల నుంచి ఆయన గెలవలేకపోయారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ టిక్కెట్‌పై గెలిచి అధికార వైఎస్సార్‌ సీపీలో కరణం బలరాం చేరిన తర్వాత ఆమంచికి సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ, చేనేత సామాజికవర్గానికి చెందిన పోతుల సునీతతోనూ ఆమంచికి అభిప్రాయ భేదాలున్నాయని టాక్‌.

ఈ నేపథ్యంలో తన ఇద్దరు బద్ధ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండడంతో పొరుగున ఉన్న పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జిగా పనిచేయాల్సిందిగా ఆమంచిని వైఎస్సార్‌సీపీ నాయకత్వం కోరింది. అయితే గత 15 ఏళ్లుగా చీరాల నుంచే రాజకీయం చేస్తున్న ఆమంచికి పర్చూరు ఇబ్బందేనని అంటున్నారు. అందులోనూ పర్చూరులో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి అక్కడ ఇమడలేననే భావనలో ఉన్నారని చెబుతున్నారు.

చీరాలలో వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ దక్కే అవకాశాలు పూర్తిగా అడుగంటడంతో ఆమంచి ఇప్పుడు జనసేనలో చేరి చీరాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. పందిళ్లపల్లి స్వయంగా ఆమంచి కృష్ణమోహన్‌ స్వగ్రామం కావడం విశేషం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు శ్రీనివాసరావు(స్వాములు) చిత్రాలను ఈ ఫ్లెక్సీపై ముద్రించడం గమనార్హం.

ఆమంచి కృష్ణమోహన్‌ తోపాటే ఆయన తమ్ముడు స్వాములు కూడా వైఎస్‌ జగన్‌ సమక్షంలో అప్పట్లో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ రాజకీయం చేస్తే.. స్వాములు రౌడీ రాజకీయాలు చేస్తారని గాసిప్స్‌ ఉన్నాయి. గతంలో పబ్లిక్‌ గా నడిరోడ్డుపైన ఓ వ్యక్తిపై స్వాములు దాడి చేస్తున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

అలాంటి స్వాములు తన అన్న అనుమతి లేకుండా తమ సొంత స్వగ్రామంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరని అంటున్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ మనసంతా చీరాల పైనే ఉందని అంటున్నారు. గత 20 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న చీరాలను వదిలి పర్చూరులో వైసీపీ తనను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించడంపై ఆమంచి రగిలిపోతున్నారని టాక్‌ నడుస్తోంది. ఎన్నికల ముందు వైసీపీకి షాక్‌ ఇవ్వడం ఖాయమేనని టాక్‌ నడుస్తోంది. అందులోనూ ప్రకాశం జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ ఆమంచికి సన్నిహిత సంబంధాలు లేకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున స్వాములు ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చీరాల రాజకీయం ఏవిధంగా ఉంటుందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.