Begin typing your search above and press return to search.

పెట్రోల్ శాసించనున్న ఎన్నిక‌ల ఫ‌లితం ఐదు రాష్ట్రాల్లో ప్రజాగ్ర‌హం ఏ రేంజ్‌ లో ఉందంటే!

By:  Tupaki Desk   |   25 March 2021 1:30 AM GMT
పెట్రోల్ శాసించనున్న ఎన్నిక‌ల ఫ‌లితం ఐదు రాష్ట్రాల్లో ప్రజాగ్ర‌హం ఏ రేంజ్‌ లో ఉందంటే!
X
ప్ర‌స్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ బెంగాల్‌లో పాగా వేయాల‌ని బీజేపీ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. అదేస‌మ‌యంలో అసోంలో తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌, మిగిలిన పార్టీల‌ను తీసుకుంటే.. బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారు ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌, త‌మిళ‌నాడులోనూ అన్నాడీఎంకే మూడో సారి అధికార పీఠంపై ఆశ‌లు పెట్టుకుంది. కేర‌ళ‌లో పిన‌ర‌యి విజ‌యం అధికారంలోకి రెండోసారి కూడా వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇలా.. మొత్తం అన్ని రాస్ట్రాల్లోనూ పార్టీలు అధికారంపై ఆశ‌లు పెట్టుకున్నాయి. కానీ.. ఈ అన్ని పార్టీల‌నూ వేధిస్తున్న కీలక స‌మ ‌స్య‌.. పెట్రో ధ‌ర‌లు! నిజానికి రాష్ట్ర ప‌రిదిలో ఈ పెంపు.. త‌గ్గింపు.. అనే అంశాలు లేక‌పోయినా.. ఇప్పుడు మాత్రం ఇటు ప్రాంతీయ పార్టీలను, అటు జాతీయ పార్టీల‌ను కూడా ఈ ధ‌ర‌లు ఉక్కిరి బిక్కిరికి గురిచేస్తున్నాయి. ప్ర‌స్తుతం లీట‌రు పెట్రోల్ 100 రూపాయ‌ల‌కు చేరువైన నేప‌థ్యంలో అన్ని ధ‌ర‌లు కూడా మండిపోతున్నారు. నిత్యావ‌స‌రాలు.. కూర‌గాయ‌లు మ‌రింత‌గా మండిపోతున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కుల‌కు ఈ ధ‌ర‌ల సంక‌ట‌మే ఇబ్బందిగా మారింది.

ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్రచారంలో క‌మ‌ల్ హాస‌న్‌కు స్థానికుల నుంచి ఇదే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఏం తినాలి? ఏం కొనాలి? అని ఆయ‌నను మ‌హిళ‌లు నిల‌దీసినంత ప‌నిచేశారు. దీనికి క‌మ‌ల్‌.. మొత్తం నేర‌మంతా కూడా బీజేపీదేన‌ని.. ఆ పార్టీని రాష్ట్రం నుంచి త‌రిమికొట్టాల‌ని వింత‌గా స‌మాధానం ఇచ్చారు. ఇక‌, ఇదే ప్ర‌శ్న బీజేపీ నేత‌ల‌ను అడిగితే.. త‌ప్పు త‌మ‌ది కాద‌ని.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌రిణామాలేన‌ని.. చెప్పుకొచ్చారు. మ‌రోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి లీట‌రు పెట్రోల్‌పై రూ.1 వ్యాట్‌ను త‌గ్గించింది. ఇక‌, కేర‌ళ ప్ర‌భుత్వం స్థానిక ప‌న్నులు పెంచ‌కుండా.. ఎన్నిక‌లు అయ్యాక చూద్దామ‌ని ప‌క్క‌న పెట్టింది. ఇలా.. మొత్తంగా ఇప్పుడు రాష్ట్రాల ఎన్నిక‌ల వేళ ఆయా పార్టీల‌ను పెట్రోల్ ధ‌ర‌లు వ‌ణికిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.