Begin typing your search above and press return to search.

భీమిలీలో అవంతినే పోటీ చేయాలంటున్న విపక్షాలు....?

By:  Tupaki Desk   |   28 Feb 2023 9:00 AM GMT
భీమిలీలో అవంతినే పోటీ చేయాలంటున్న విపక్షాలు....?
X
విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు సొంత పార్టీలో ఎలా ఉందో తెలియదు కానీ ఆయనే పోటీ చేయాలని విపక్షాలు గట్టిగా కోరుకుంటున్నాయి. ప్రత్యేకించి తెలుగుదేశం అయితే అవంతి ఉంటే చాలు మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదని భావిస్తోందిట. ఎందుకంటే అవంతికి ఈసారి వ్యతిరేకత బాగా ఉందని తెలుగుదేశం పార్టీ అంచనా కడుతోంది.

అవంతి మంత్రిగా మూడేళ్ల పాటు పనిచేశారు. అయినా నియోజకవర్గానికి చేసిన మేలు ఏదీ లేదని ప్రజలతో పాటు పార్టీలు సైతం అంటున్నాయి. మరో వైపు చూస్తే మంత్రిగా ఉన్నన్ని రోజులూ అవంతి ఈ వైపుగా పెద్దగా దృష్టి పెట్టలేదని కూడా విమర్శలు ఉన్నాయి. వైసీపీలో వర్గ పోరు మరో సమస్యగా ఉంది. వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారు మంత్రితో పాటు కొత్తగా వచ్చి చేరిన వారున్నారు. దాంతో మంత్రి తన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న బాధ క్యాడర్ లో ఉంది అంటున్నారు.

ఇక లోకల్ కార్డుతో కొందరు నాయకులు తమకే టికెట్ ఈసారి ఇవ్వాలని కోరుతోంది. అయితే నియోజకవర్గం స్థాయిలో ఫోకస్ అయ్యే నేతలు లేకపోవడం వైసీపీకి పెద్ద లోటుగా ఉంది. వైసీపీ అధినాయకత్వం చేయిస్తున్న సర్వేలు సైతం అవంతి పనితీరు మీద నెగిటివ్ రిపోర్టునే అందిస్తున్నాయట.

ఇక విపక్షంలో చూస్తే తెలుగుదేశానికి భీమిలీ కంచుకోట. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంత బలంగా ఉన్నా అవంతి గట్టి నేత అయినప్పటికీ అప్పటికపుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మాజీ ఎంపీ సబ్బం హరి మీద కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. దాంతోనే భీమిలీలో టీడీపీ హవా ఏంటి అన్నది తెలుస్తుంది అంటున్నారు. రెండేళ్ళ క్రితం జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లోనూ భీమిలీలో ఎంపీపీటీసీలతతో పాటు కార్పోరేటర్లను కూడా టీడీపీ బాగానే గెలుచుకుంది.

అది టీడీపీ బలం అయితే జనసేన కూడా గట్టిగానే ఉంది. ఆ పార్టీ తరఫున పంచకర్ల సందీప్ భీమిలీ నుంచి పోటీ చేస్తే పాతిక వేల ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఇపుడు మరింతగా జనసేన పెరిగిందని జనసేన అంటోంది. దీంతో పొత్తు లేకపోయినా తెలుగుదేశం గెలిచే సీటు ఇది అంటున్నారు. పొత్తులు ఉంటే ఈ సీటుని భారీ మెజారిటీతో విపక్షం పట్టుకుపోవడం ఖాయమని అంటున్నారు. 2014లో ఇదే సీటుని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం తరఫున పోటీ చేసి నలభై వేలకు పైగా మెజారిటీతో గెలుచుకున్నారు

దాంతో ఇపుడున్న పరిస్థితుల్లో అవంతినే అలా ఉంచేసే చాలు తాము పెద్దగా ఆయసపడకుండా గెలుస్తామని విపక్షాలు బల్ల గుద్ది చెబుతున్నాయి. వైసీపీ అధికారికంగా చేయించిన సర్వే కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్ సైట్ కూడా చేయించిన సర్వేలో అవంతి ఓడిపోతారనే వచ్చిందంట. ఎన్నికలు ఏడాది దగ్గరకు వచ్చేశాయి. ఇపుడు అవంతిని మార్చినా ఉపయోగం ఉంటుందా అన్నది ఒక ప్రశ్న అయితే కొత్తగా ఎవరిని దించినా బలంగా ఉన్న టీడీపీ జనసేనలను తట్టుకోగలరా అన్నది మరో ప్రశ్నగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.