Begin typing your search above and press return to search.

క‌రోనా ఎఫెక్ట్‌: బ‌తికున్న త‌ల్లికి `దినం` చేసేశారు.. ఆమె తిరిగొచ్చింది.. ఏపీలో ఘ‌ట‌న‌!

By:  Tupaki Desk   |   2 Jun 2021 11:30 PM GMT
క‌రోనా ఎఫెక్ట్‌:  బ‌తికున్న త‌ల్లికి `దినం` చేసేశారు..  ఆమె తిరిగొచ్చింది.. ఏపీలో ఘ‌ట‌న‌!
X
ప్ర‌స్తుతం క‌లికాలం కాదు.. క‌రోనా కాలం న‌డుస్తోంది. క‌రోనా ఎఫెక్ట్‌తో అనుబంధాలు, బంధాలు మాయ‌మ‌వు తున్నాయి. క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్న వారు మ‌న అని తెలిసి కూడా.. క‌నీసం చూసేందుకు సైతం ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ స‌మ‌యంలో చ‌నిపోయిన వారికి క‌ర్మ‌కాండ‌లు నిర్వ‌హించ‌డం అనేది నిజంగా `భారంగా` మారుతోంది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితికి ఎదురు నిలిచిన ఓ కుటుంబం.. క‌రోనా మాయ‌లో ప‌డి.. బ‌తికున్న త‌ల్లికి క‌ర్మ‌కాండ‌లు చేసింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే!
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గిరిజ‌మ్మ అనే వృద్ధురాలికి క‌రోనా సోకింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు గ‌త మే నెల 12న విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేర్పించి వైద్యం అందేలా చేశారు. అయితే.. రెండు రోజుల త‌ర్వాత ఆమెను ప‌రామ‌ర్శించేందుకు ఇద్ద‌రు కొడుకులు, భ‌ర్త ఆసుప‌త్రికి వెళ్లి చూడ‌గా.. ఆమెకు కేటాయించిన బెడ్‌పై గిరిజ‌మ్మ క‌నిపించ‌లేదు. దీంతో వార్డు బాధ్యులుగా ఉన్న‌వారిని ఆరా తీశారు. ఏమో ఎక్క‌డికి వెళ్లిందో అని స‌మాధానం చెప్ప‌డంతో వార్డు మొత్తం క‌లియ‌దిరిగి రెండురోజులు వెతికారు.

త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..
రెండో రోజు కూడా వెతికినా గిరిజ‌మ్మ క‌నిపించ‌క‌పోయే స‌రికి చ‌నిపోయి ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో మార్చురీలో వెతికారు. అక్క‌డ ఓ వృద్దురాలి మృత దేహం క‌నిపించ‌డంతో.. కొన్ని ఆన‌వాళ్ల‌ను బ‌ట్టి త‌మ కుటుంబ స‌భ్యురాలే అనుకుని ఇంటికి తెచ్చి.. క‌ర్మ‌కాండ‌లు నిర్వ‌హించేశారు. ఇక‌, ఆసుపత్రి వర్గాలు డెత్ స‌ర్టిఫికెట్ కూడా ఇచ్చి పంపేశారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలూ పూర్తి చేశారు. గిరిజమ్మ కుమారుడు గత నెల 23న కరోనాతో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ పెద్దకర్మ చేశారు.

ఇంటికి తిరిగి రావ‌డంతో.. అవాక్కు!
అంద‌రూ చ‌నిపోయింద‌ని భావిస్తున్న గిరిజ‌మ్మ బుధ‌వారం నింపాదిగా ఇంటికి చేరుకునే స‌రికి అంద‌రూ అవాక్క‌య్యారు. తాను ఆసుపత్రిలో ఉంటూనే కరోనా నుంచి కోలుకున్నట్టు గిరిజమ్మ చెప్పారు. అంతేకాదు, తనంతట తానుగా ఇంటికి చేరుకున్నాన‌ని వెల్ల‌డించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ కుటుంబ స‌భ్యుల్లో ఆనందం నింపినా.. ఆసుప‌త్రి బాధ్యుల నిర్ల‌క్ష్యాన్ని, వైద్యుల నిర్ల‌క్ష్యాన్ని కొట్టొచ్చిన‌ట్టు క‌ళ్ల‌కు క‌ట్టేలా చేసింది. మ‌రి ఇంత‌కీ.. గిరిజ‌మ్మ అనుకుని కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు చేసిన ఆ మ‌హిళ ఎవ‌రు? ఎక్క‌డివారు అనేది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. ఇదీ.. ఏపీ స‌ర్కారు ఘ‌నంగా చెబుతున్న క‌రోనా చికిత్స.. క‌రోనా విష‌యంలో చూపుతున్న బాధ్య‌త!! అని పెద‌వి విరుస్తున్నారు గిరిజ‌మ్మ‌కుటుంబ స‌భ్యులు.