Begin typing your search above and press return to search.

వైఎస్సార్ పింఛను మీద కొత్త రూలు పిడుగు? ఇప్పుడేం కానుంది?

By:  Tupaki Desk   |   4 April 2023 10:05 AM GMT
వైఎస్సార్ పింఛను మీద కొత్త రూలు పిడుగు? ఇప్పుడేం కానుంది?
X
కొన్ని నిర్ణయాలు మొదట్నించి ఉంటే బాగుంటుంది. ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసే వేళలో ఏ నిబంధనల్ని అయితే అమలు చేస్తారో.. వాటినే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా కొన్నేళ్ల తర్వాత కొత్త రూల్స్ పెడితే. లబ్థిదారుల ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుంది. పథకాన్ని అమలు చేసే సమయంలో. తాము పెద్దమనసుతో అన్ని విషయాల్ని ఆలోచించి.

ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నట్లుగా వ్యవహరించి.. కీలకమైన ఎన్నికలకు ఏడాది ముందుకు వచ్చేసరికి.. కొత్త పరిమితులను తెర మీదకు తీసుకురావటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ గా జరుగుతుందంటున్నారు. ఈ అంశం ముఖ్యమంత్రి జగన్ కు చెప్పే చేస్తున్నారా? లేదంటే. ఆయన వరకు విషయాన్ని తీసుకురాకుండా సొంత పెత్తనంతో ఇలాంటి పనులు చేస్తున్నారా? అన్న సందేహాం వ్యక్తమవుతోంది.

సామాజిక భద్రతలో భాగంగా వైఎస్సార్ పింఛన్ పథకాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తోంది ఏపీలో ని జగన్ సర్కార్. అయితే.. మొదట్నించి ఉన్న పోర్టబులిటీ విధానాన్ని ఈ మధ్యనే రద్దు చేసింది. ఇది సరిపోదన్నట్లుగా ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలన్న కొత్త మెలిక పెట్టిన వైనం తెలిసిందే. వీటన్నింటి మధ్య ఈ నెల (ఏప్రిల్) నుంచి మరో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో జియో ఫెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం నివాస ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలోని సచివాలయప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వాలంటీర్లు పింఛన్ ను అందిస్తారు.

ఒకవేళ ఎవరైనా లబ్థిదారులు సచివాలయ ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే.. అలాంటి వారంతా పింఛను మొత్తాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఒకవేళ.. అలాంటి వారు తమ పింఛన్ తీసుకోవాల్సి వస్తే.. జిల్లా డీఆర్ డీఏ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందన్న కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విధానంతో లబ్థిదారులు ఏదైనా సమస్యతో ఆసుపత్రుల్లో కానీ.. ఇతర కారణాలతో వేరే ప్రాంతంలో ఉండి ఉంటే.. అలాంటి వారికి పింఛన్ లభించదు.

ఇలాంటి విధానం పథకం అమలు చేసే మొదటి రోజు నుంచి ఉంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా ఇన్ని రోజులు ఒకలా పంపిణీ చేసి.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది ముందు పథకాన్ని అమలు చేసే విధానంలో మార్పులు చేస్తే.. లబ్థిదారుల్లో ఆగ్రహం పెల్లుబుకే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలిసే చేశారా? లేదంటే.. సొంత పెత్తనంతో అధికారులు ఎవరైనా చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇష్యూ పై ముఖ్యమంత్రి వెంటనే ఫోకస్ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.