Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ ఉద్యోగి హ‌త్య‌లో సంచ‌ల‌నాలు

By:  Tupaki Desk   |   6 Feb 2017 12:54 PM GMT
ఇన్ఫోసిస్ ఉద్యోగి హ‌త్య‌లో సంచ‌ల‌నాలు
X
ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని దారుణహత్యకు గురయిన ఉదంతంలో విస్మ‌య‌క‌ర నిజాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. కంపెనీ కార్యాలయంలో విధుల్లో ఉండగానే కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన కే రాసిల రాజు(23) హత్యకు గురి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన సెక్యూరిటీ గార్డు - అసోంకు చెందిన భాబెన్ సైకియా(26)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో నిందితుడైన సెక్యురిటీ గార్డుతో పాటు బాస్ నుంచి సైతం వేదింపులు ఎదుర్కొన్నారు. ఆమె హ‌త్య‌కు గురి అయే సమ‌యానికి కొద్దిరోజుల ముందు త‌న కుటుంబ స‌భ్యుల‌తో చెప్పుకొని వాపోయింది. తన టీమ్ మేనేజర్ తన మీద అదనపు ఒత్తిడి పెడుతున్నారని, అతడితో లంచ్‌ కి వెళ్లడానికి తాను నిరాకరించినప్పటి నుంచి అలా చేశారని - తాను పెట్టుకున్న ట్రాన్స్‌ ఫర్ అప్లికేషన్‌ ను కూడా పెండింగులో పెట్టారని బాధితురాలు.. హత్య జరగడానికి మూడు రోజుల క్రితమే తన తండ్రికి చెప్పింది. ట్రాన్స్‌ఫర్ విషయంలో మేనేజర్‌ కు - ఆమెకు గొడవ జరిగిందని, అప్పుడే ఆయన ఆమెకు గుణపాఠం చెబుతానని బెదిరించారని రసీలా సోదరుడు లైజిన్ కుమార్ చెప్పారు. మ‌రోవైపు రాసిల రాజు వరుసకు సోదరి అయ్యే అంజలి నందకుమార్‌ తో ఫోన్‌ లో మాట్లాడిన సందర్భంలో ఇంకో షాకింగ్ విష‌యాన్ని చెప్పారు.

హ‌త్య కావ‌డానికి కొద్దిస‌మ‌యం ముందు త‌న‌తో ఫోన్ లో మాట్లాడుతూ ఎవ‌రో త‌న చాంబ‌ర్ లోకి వ‌స్తున్నార‌ని తెలిపి మ‌ళ్లీ చేస్తాన‌ని చెప్పింద‌ని అంత‌లోనే ఈ ఘోరం జ‌రిగిపోయింద‌ని వాపోయింది. ఇక పోస్ట్ మార్గం నివేదిక‌లోనూ షాకింగ్ విష‌యాలు ఉన్నాయి. రాసిల రాజు ముఖం మీద - ఎదమీద పలుసార్లు గట్టిగా కొట్టిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమెపై దాడి చేయడానికి ఏదో గట్టి వస్తువును ఉపయోగించారని, దాని గాయాలే ఆమె ముఖం మీద - ఎదమీద ఉన్నాయని స‌ద‌రు వైద్యుడు విశ్లేషించారు. మెడకు విద్యుత్ తీగ ఉన్న స్థితిలోనే మృతదేహాన్ని మార్చురీకి తెచ్చామ‌ని పేర్కొటూ ఆ వైరును బాగా గట్టిగా బిగించడంతో నోటి నుంచి - ముక్కు నుంచి రక్తం కారిందని, బహుశా అది నిందితుడి దుస్తుల మీద కూడా పడి ఉండొచ్చని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇంత ఘోర‌మైన రీతిలో హ‌త్య జ‌రిగి ఉంటే ఆధారాల‌ను సేక‌రించ‌కుండానే పోస్ట్ మార్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా పుణెలోని హింజేవాడి రాజీవ్‌ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయంలో రాసిల రాజు సిస్టమ్స్ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారు. బెంగళూరు కార్యాలయంలో పనిచేసే రాసిల ఒక ప్రాజెక్టు పనిమీద ఇటీవల పుణె బ్రాంచ్‌ కు వచ్చారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో రాసిల విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డు భాబెన్ సైకియా అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో దూరంగా ఉండాలని రాసిల హెచ్చరించారు. పని ఒత్తిడి వ‌ల్ల‌ ఆదివారం కూడా ఆమె విధులకు హాజరయ్యారు. రాసిల పనిచేసే దగ్గరకు వచ్చిన సైకియా తనపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దని కోరాడు. దానికి ఆమె ససేమిరా అని కాన్ఫరెన్స్ హాలులోకి వెళ్లారు. ఆమె వెనుకాలే హాలులోకి ప్రవేశించిన నిందితుడు కంప్యూటర్ వైరును మెడకుచుట్టి ఆమె ముఖంపై దాడిచేసి గొంతునులిమి చంపేశాడు.

ఇదిలాఉండ‌గా...హత్యకు గురైన టెక్కీ ఓపీ రాసిలా రాజు కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం చెల్లించేందుకు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంగీకరించింది. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేందుకూ సుముఖత వ్యక్తం చేసింది. భద్రతాలోపం వల్లే తన కూతురు మరణించిందని రాసిలా తండ్రి ఆరోపించిన మరుసటి రోజే ఇన్ఫోసిస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్ ప్రతినిధి సంతోశ్ నాయర్ సంతకం చేసిన లేఖను ఓపీ రాసిలా కుటుంబానికి పంపింది. ఓపీ రాసిలా కుటుంబం నామినేట్ చేసిన వ్యక్తికి ఉద్యోగం కల్పించడంతోపాటు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించిందని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/