Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే దొంగ ఓటు వేశాడా?

By:  Tupaki Desk   |   4 April 2021 3:30 AM GMT
ఎమ్మెల్యే దొంగ ఓటు వేశాడా?
X
తెలంగాణ‌లో ఇటీవ‌ల రెండు ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు ముగిశాయి. రెండింటిలోనూ అధికార టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. ప్ర‌భుత్వం, గులాబీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అంతా హ్యాపీ. కానీ.. ఓ ఎమ్మెల్యేకు ఇప్పుడు చిక్కులు మొద‌ల‌య్యాయి. ఏమైందంటే.. శాస‌న‌స‌భ్యుడు త‌ప్పుడు విద్యార్హ‌త స‌ర్టిఫికెట్ల‌తో ఓటు పొంది, దొంగ ఓటు వేశాడ‌ని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో.. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌లు రాష్ట్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి శశాంక్ గోయ‌ల్ కు ఫిర్యాదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. త్వ‌ర‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, గ‌వ‌ర్న‌ర్ కు సైతం ఫిర్యాదు చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి కాంగ్రెస్ వాళ్లు చూపిస్తున్న ఆధారాలు ఇలా ఉన్నాయి.

ఎన్నిక‌ల అఫిడ‌విట్లో స్వీడ‌న్ లో డిగ్రీ చేసిన‌ట్టుగా చూపించార‌ని, వెబ్ సైట్లో మాత్రం అమెరికాలో ఎంఎస్ చ‌ది‌వినట్టుగా పొందుప‌రిచార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ వివ‌రాల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు అంద‌జేసిన‌ట్టు తెలిసింది. వాటిని ప‌రిశీలించిన శ‌శాంక్ గోయ‌ల్‌.. క‌లెక్ట‌ర్ ద్వారా విచార‌ణకు హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఎమ్మెల్యే డిగ్రీ స‌ర్టిఫికెట్ ప‌రిశీలించ‌కుండా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓటు హ‌క్కు ఎలా క‌ల్పించార‌ని? ఆ ఎన్నిక‌ల సిబ్బందిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట కాంగ్రెస్ నేత‌లు. డిగ్రీ లేకుండా దొంగ ఓటు వేసిన ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నార‌ట‌. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఖండించిన‌ట్టు స‌మాచారం. మ‌రి, ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుంది? ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అన్న‌ది చూడాలి.