Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పిన భేటీ

By:  Tupaki Desk   |   21 Feb 2023 5:00 PM GMT
ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పిన భేటీ
X
రాజకీయాల్లో శతృవులు ఉండరు, కేవలం ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారు అని తరచూ మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెబుతూ ఉంటారు. నిజమే రాజకీయాన్ని ఒక క్రీడగా తీసుకోవాలి. ఆ స్పూర్తి అందరిలో రావాలి. ఒక ఎన్నికల్లో ఓటమి పాలు అవుతారు. దాన్ని తేలికగా తీసుకుని నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకోవాలి. గెలిచిన పార్టీకి చేతనైతే సహకారం నిర్మాణాత్మకమైన విపక్షంగా ఇవ్వాలి. అలాగే గెలిచిన పార్టీ కూడా మిడిసిపడరాదు.

ఓడిన వారిని ఏకంగా రాజకీయ క్రీడా మైదానం నుంచి దూరం చేయాలని చూడడమూ తప్పే. ఇక అసెంబ్లీ ఉన్నది అటూ ఇటూ సభ్యులు అంతా కలసి ప్రజలకు మేలు చేసే చట్టాలను చేయడానికి ఆ విషయంలో మంచి సూచన విపక్షం నుంచి వచ్చినా స్వీకరించే పెద్ద మనసు ఉండాలి. అయితే ఇదంతా నలభై యాభై ఏళ్ల క్రితం జరిగిన ముచ్చట.

ఇపుడు మాత్రం రాజకీయం అంటే కక్ష కార్పణ్యంగానే ఉంది. రాజకీయ పార్టీలు శతృ భావంతో ఉంటున్నాయి. ప్రత్యర్ధులు అన్న విషయాన్ని మరచిపోతున్నారు. కనీసం ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. గవర్నర్ రాష్ట్రానికి పెద్ద గా ఉంటారు. ప్రధమ పౌరుడు. ఆయన గణతంత్ర వేడుకల వేళ ఎట్ హోం అని పిలిస్తే అక్కడకు వెళ్ళినా అధికార విపక్షాల నేతలు పలకరించుకునే పరిస్థితి లేకుండా పోతోంది.

మీరు ఓడిపోతారు అని అనుకోవడం వేరు. మీరు జైలుకి వెళ్తారు, మీరు నాశనం అవుతారు అన్న దారుణమైన కామెంట్స్ చేసుకుంటున్న వర్తమాన రాజకీయాల్లో ఎడారిలో ఎండమావిలా ఒక భేటీ జరిగింది. నిజానికి అది అత్యంత విషాద సందర్భం. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు, తెలుగుదేశం యువ నేత నందమూరి తారకరత్న అకాల మరణం కారణంగా అటూ ఇటూ బంధువులు అయిన వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలిశారు

పక్క పక్కనే కూర్చుని విషాదాన్ని నిండా నింపుకున్నారు. తమ ఆత్మీయుడు లేడన్న వార్తతో ఇద్దరూ ఖిన్నులై ఆ బాధాతప్త హృదయాన్ని తెరచి మాట్లాడుకున్నారు. నిజానికి ఇది మామూలుగా అయితే వార్త కాదు, వింత అంతకంటే కాదు, కానీ ఏపీలో ఉప్పూ నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీ రాజకీయం మధ్య ఈ ఇద్దరు నేతలు పక్కనే కూర్చోవడాన్ని సోషల్ మీడియా అంతా వైరల్ చేసింది. అలా వారు కలసి ఉన్న దృశ్యాన్ని కూడా ఎవరికి తోచిన తీరున వారు చర్చకు పెట్టి తమ భావాలను రాశారు.

ఇది మంచిది కాదు అంటాడో టాలీవుడ్ నిర్మాత కం నటుడు. ఎందుకు మంచిది కాదో ఆయనే చెప్పాలి. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు, అక్కడ సందర్భం ఒకరి అకాల మరణం. ఆ సమయంలో కూడా ముఖాముఖాలు చూసుకోకుండా ఉండగలరా. నిజానికి విజయసాయిరెడ్డి చంద్రబాబు ఇద్దరూ కలసి అంతటి విషాద సమయంలోనూ తెలుగు రాజకీయాలకు ఒక మంచి సందేశం పంపించారు.

రాజకీయంగా ఎన్ని అనుకున్నా మంచితనం మానవత్వం మాత్రమే గెలుస్తాయని చాటి చెప్పారు. ఆపద సమయాన ఒకరికి ఒకరుగా కలసి ఉండాలని కూడా చెప్పకనే చెప్పారు. దీని మీద చాలా రకాలైన వ్యాఖ్యానాలు వస్తున్నాయంటే అది వారి విజ్ఞతగా చూడాలి. అంతే కాదు వర్తమాన రాజకీయం చూసి ఇలాగే ఉండాలనుకునే భ్రమపడే వారి మానసిక వైఖరికే వదిలేయాలి. నిజం చెప్పాలంటే చంద్రబాబు గురించి అంతా ఒకటి అంటారు. ఆయన ట్రూ పొలిటీషియన్.

రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు. ఆయన వ్యక్తిగతానికి దాన్ని ముడిపెట్టరు. ఎలాంటి వారు వచ్చినా కలసి మాట్లాడే చొరవ చూపిస్తారు. ఆయనను విమర్శించి బయటకు వెళ్ళిన తమ్ముళ్లు తిరిగి సొంత పార్టీలోకి వస్తే అంతే ఆప్యాయతతో వారిని అక్కున చేర్చుకునే ఔదార్యం బాబుకి ఉందని చెబుతారు. ఆయన వారు ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయారో అని ఆలోచిస్తారు తప్ప తనను ఎందుకు మాటలు అన్నారని అనుకోరు అంటారు.

ఇక ఈ సందర్భంగా ఒక పాత ముచ్చట కూడా చెప్పాలి. జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు ఆయన బర్త్ డే వచ్చింది. అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేరుగా జగన్ కూర్చున్న సీటు వద్దకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత రాజకీయ విమర్శలు చేసుకున్నారు. కానీ వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు అన్నది బాబును చూసే ఎవరైనా నేర్చుకోవాలి. వైఎస్సార్ కూడా అలాగే ఉండేవారు.

ఇక ఇపుడు చూస్తే విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అత్తమామల వైపు నుంచి బంధువుగా అక్కడికి వెళ్లారు. ఆయన నందమూరి వారితో బంధువులతో బాధను పంచుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి అన్నీ తానై అంతా నిర్వహించారు. విజయసాయిరెడ్డి లోని మరో కోణం ఈ విధంగా అంతా చూశారు. ఆయనలో పొలిటికల్ ఫైర్ నే చూసిన వారు ఇపుడు ఆయన ఏంటి అన్నది కూడా చర్చించుకుంటున్నారు.

అయితే వైసీపీలో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి. ఎలా తీసుకుంటారు అన్న చర్చ కూడా ఉంది. ఒక విధంగా చూస్తే విజయసాయిరెడ్డి చంద్రబాబు పక్కపక్కన కూర్చోవడాన్ని వైసీపీలో ఎవరూ అంతగా జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ అక్కడ విషాదం జరిగింది. సందర్భం వేరు. అలా చూస్తే కనుక ఆయన చేసింది నూరు శాతం కరెక్ట్ అనే అంటారు. కానీ వైసీపీలో విజయసాయిరెడ్డి విషయంలో ఇప్పటికే అధినాయకత్వం ఒక విధంగా ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందా అన్న చర్చ కూడా ఉంది.

వాటిని పక్కన పెడితే మాత్రం ఆయన తన మానవత్వాని మంచితనాన్ని, పెద్దమనిషి తనాని చాటుకున్నారు. హుందాగా వ్యవహరించారు అన్నదే అందరి మాట. బాబు విజయసాయిరెడ్డి కలయిక ఏపీలో పగతో రగులుతున్న రాజకీయాలకు ఒక మంచి సందేశంగా చూడాల్సి ఉంది. ఇక మీదట మంచికైనా చెడ్డకైనా నేతలు అంతా కలిస్తే ఏపీకి అది ఎంతో మేలు చేస్తుంది అనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.