Begin typing your search above and press return to search.

ఈ పిజ్జా బ‌దులు.. ఖ‌రీదైన కారు కొనేయొచ్చు

By:  Tupaki Desk   |   5 Nov 2017 5:12 AM GMT
ఈ పిజ్జా బ‌దులు.. ఖ‌రీదైన కారు కొనేయొచ్చు
X
పిజ్జా మాట విన్నంత‌నే నోరూరిపోతుంది. నోట్లో నీళ్లు అప్ర‌య‌త్నంగా వ‌చ్చేస్తాయి. దాదాపు పాతికేళ్ల కింద‌ట దేశంలోకి అడుగుపెట్టిన పిజ్జా.. త‌న ప్ర‌స్థానంలో భార‌తీయ ఆహారంలో భాగ‌మైపోయింది. దేనినైనా త‌మ‌లో ఇముడ్చుకునే భార‌తీయుల‌కు ఇప్పుడు పిజ్జా చాలా కామ‌న్‌.

ఇలాంటి పిజ్జాకు సంబంధించి ఒక ముచ్చ‌ట ఆస‌క్తిక‌రంగా మారింది. మామూలుగా అయితే.. రూ.30 నుంచి పిజ్జాల‌ను అమ్ముతుంటారు. భారీ మాల్స్ లో పెద్ద‌సైజు పిజ్జా ముక్క‌ను అక్క‌డిక‌క్క‌డ త‌యారు చేసి అమ్మేసి అల‌వాటు మొద‌లైంది. కానీ.. ఇప్పుడు మీకు చెప్పే పిజ్జా రేటు వింటే అవాక్కు అవ్వాల్సిందే. అంత రేటు ఉంటుందా? అని సందేహం రావాల్సిందే.

ఇంత‌కీ ఖ‌రీదైన పిజ్జా ఎంత‌? అదెక్క‌డ దొరుకుతుంది? దాన్ని ఎంత టైంలో త‌యారు చేస్తారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే.. ఇట‌లీకి చెందిన ప్ర‌ముఖ చెఫ్ రినాటో వైలా మ‌రో ఇద్ద‌రు క‌లిసి ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన పిజ్జాను త‌యారు చేశారు. దానికి లూయిస్ 13అని పేరు కూడా పెట్టేశారు.

ఇంత‌కీ ఆ పిజ్జా స్పెషాలిటీ.. దాని ధ‌రే. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఈ పిజ్జా ధ‌ర జ‌స్ట్ 12వేల డాల‌ర్లు మాత్ర‌మేన‌ట‌. అంటే.. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే జ‌స్ట్ రూ.7ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ట‌. పిజ్జా సంగ‌తి త‌ర్వాత‌.. ఈ డ‌బ్బులు పెడితే బ్ర‌హ్మాండ‌మైన సెడాన్ కారు రావ‌టం ఖాయం.

ల‌క్ష‌ల రూపాయిల పిజ్జాను డెలివ‌రీకి 72 గంట‌ల ముందే త‌యారు చేస్తార‌ట‌. 20 సెంటీమీట‌ర్ల వ్యాసం అంటే ఈ పిజ్జాను కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే తిన‌గ‌ల‌రు సుమా. ముగ్గురు వంటోళ్లు (కాస్త గొప్ప‌గా చెప్పాలంటే చెఫ్ లు) త‌యారుచేస్తార‌ట‌. ఇంత‌కీ ల‌క్ష‌ల పిజ్జా ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. దీన్ని ఫ్రాన్స్‌.. ఇట‌లీలో దొరికే అత్యంత అరుదైన ముడిస‌రుకుతో త‌యారు చేస్తార‌ట‌. ఎంత అరుదైన ముడిస‌రుకు అయితే మాత్రం.. రూ.7ల‌క్ష‌లా? ఇక్క‌డో ముచ్చ‌ట గ‌మ‌నించారా? ఇన్ని ల‌క్ష‌లు పోసి కొనే పిజ్జా.. త‌యారు చేసిన 72 గంట‌ల త‌ర్వాత డెలివ‌రీ.. మ‌న అల‌వాట్ల‌లో చెప్పాలంటే స‌ద్దిపోయిన‌ట్లు. ఆ మాత్రం దానికే అన్ని ల‌క్ష‌లు పోసి కొనుక్కోవాలా? ఎవ‌రి ఆనందం వారిదంటే ఇదేనేమో?