Begin typing your search above and press return to search.

18 సార్లు కత్తులతో ఆ లాయర్ ను నరికారు.. కారెక్కి చంపేశారు

By:  Tupaki Desk   |   18 Feb 2021 7:44 AM GMT
18 సార్లు కత్తులతో ఆ లాయర్ ను నరికారు.. కారెక్కి చంపేశారు
X
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదుల భార్యభర్తల హత్య కలకలం రేపింది. వారిపై ఎంతో దారుణంగా నడిరోడ్డుపై హత్య చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. వారిపై ఎంత పగ కక్ష ఉందో తెలిసిపోయింది. లాయర్ వామన్ రావుపై పగ ప్రతీకారంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తులతో నరికి చంపారు. వామన్ రావు ఇక బతకకూడదనే ఇలా చేశారు. అడ్డు రాకూడదనే లక్ష్యంతో అతనిపై విచక్షణ మరిచి దాడి చేశారు. ఉన్మాదంగా, ఫ్యాక్షనిస్టులు సైతం భయపడేలా కత్తులో విరుచుకుపడ్డారు.

వామన్ రావు శరీరం నుంచి నెత్తురు చిమ్ముతున్నా కనికరం లేకుండా కసాయిల్లా ప్రవర్తించారు. కత్తులతో నరికినా కుంట శ్రీనివాస్ పగ చల్లారలేరలేదేమో.. మరింత క్రూరంగా రక్తం మడుగులో పడిపోయిన వామన్ రావుపై కారు ఎక్కించి పారిపోయారు. జనం చూస్తారన్న భయం లేదు, వాళ్లు పట్టుకుంటారన్న జంకు లేదు.

చుట్టూ జనాలు చూస్తున్నా.. భయం లేకుండా నిమిషాల్లోనే వామన్ రావుపై నిందితులు దాడి చేశారు. దాడి జరుగుతున్న సమయంలో వెనుక రెండు బస్సుల నిండా జనం ఉన్నారు. అయినా ఒక్కరు కూడా స్పందించలేదు. బైకులపై వెళ్తున్న వారు అడ్డుకోకుండా.. ఏదో సినిమా చూస్తున్నట్లు నిలబడి చూశారు. కొంతమంది అయితే మనకెందుకులే అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆర్తనాదాలు చేస్తున్న వ్యక్తిని కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

అసలు వామన్ రావు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. చంపేంత పగ కుంట శ్రీనివాస్‌కు ఏముందంటే మాత్రం అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో కుంట శ్రీనివాస్ అక్రమాలకు వామన్ రావు అడ్డు పడుతుండటంతో.. అతను కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో తప్పులను ప్రశ్నిస్తుండంతో రగిలిపోయినట్లు తెలుస్తోంది. అదే మనసులో పెట్టుకుని అదును కోసం శ్రీనివాస్ ఎదురు చూశారు. వామన్ రావు మంథని కోర్టుకు వచ్చి వెళ్తున్న సమయంలో మాటు వేసి దాడి చేశారు. పెద్దపల్లి వెళ్తున్న వామన్ రావు కారుకు.. తన కారును రాంగ్ రూటులో వచ్చి కారును అడ్డు పెట్టాడు శ్రీనివాస్. కారులో కూర్చున్న వామన్ రావును కిందకు దించేందుకు కారు అద్దాలను పగలకొట్టారు. అడ్డుపడుతుందేమోననే అనుమానంతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆ తర్వాత వామన్ రావును కారు నుంచి కిందకు దించి కత్తులతో దాడి చేశారు.

వామన్ రావు తనకు సాయం చేయండి అంటూ కొన ఊపిరితో ప్రాధేయ పడ్డాడు. తనకు ఎవరైనా మంచినీళ్లు ఇవ్వడం అని, తనను ఆసుపత్రికి తరలించండి అంటూ వేడుకున్నాడు. అప్పటికే ఘటనా స్థలంలో కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయంలో వామన్ రావు తుది శ్వాస విడిచాడు.

వామన్ రావ్. నాగమణి హత్య వెనుక కుంట శ్రీనివాస్ హస్తం ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాలు విడుస్తున్న సమయంలో కూడా తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని వామన్ రావు చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు గుంజపడుగ గ్రామంలోని ఓ భూ వివాదమే కారణమని తెలుస్తోంది. 21 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కొంత కాలంగా వామన్ రావు శ్రీనివాస్‌పై పోరాడుతున్నారు.