Begin typing your search above and press return to search.

గ్లోబల్ మూడ్ చెప్పిన తాజా సర్వే.. జీతాలు పెరుగుతాయన్న ఆశే ఎక్కువట

By:  Tupaki Desk   |   22 Dec 2020 6:45 AM GMT
గ్లోబల్ మూడ్ చెప్పిన తాజా సర్వే.. జీతాలు పెరుగుతాయన్న ఆశే ఎక్కువట
X
మరో వారంలో ముగిసే 2020ను రానున్న కొన్నేళ్లలో ఎవరూ మర్చిపోలేరు. ఆ మాటకు వస్తే.. యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా మాట్లాడుకునే పరిస్థితి. అంతలా ప్రభావం చూపిన మహమ్మారికి ముగింపు పలికినట్లేనని ఇంతకాలం భావించారు. ఎప్పుడైతే బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు కొత్త భయాన్ని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జాబ్ పోర్టల్ ఇండీడ్ సంస్థ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కంపెనీలు.. ఉద్యోగులతో కలిపి గ్లోబల్ సర్వే నిర్వహించింది.

మొత్తం 3600 కంపెనీలు.. 14,142 మంది ఉద్యోగులకు పలు ప్రశ్నలు సంధించారు. నవంబరు 13-20 మధ్య కాలంలో దీన్ని నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2020 సంవత్సరం తమను అన్ని రకాలుగా దెబ్బేసిన నేపథ్యంలో 2021లో తమ వేతనాలు బాగా పెరుగుతాయని భారతీయ ఉద్యోగులు 56 శాతం ఆశిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో 20 శాతం.. సింగపూర్ లో 23 శాతమే జీతాల పెంపుపై పాజిటివ్ గా ఉన్నట్లుగా వెల్లడైంది.

2021లో కెరీర్ అవకాశాలు బాగుంటాయని భారతీయ ఉద్యోగుల్లోని ప్రతి ముగ్గురిలో ఒకరు చెప్పారు. దీనికి కారణం కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న వార్తలే కారణమని చెబుతున్నారు. ఉద్యోగ భద్రతపై 59 శాతం మంది.. ఉద్యోగుల శ్రేయస్సుపై 44 శాతం మంది నమ్మకంగా ఉన్నారు. ఇతర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా లేమని 54 శాతం మంది వెల్లడించటం గమనార్హం.

ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పుడు..కొత్త కంపెనీలకు వెళితే.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న సందేహాన్ని ఎక్కువమంది వెల్లడించారు. కుటుంబంతో గడపటానికి ఎక్కువ సమయం లభించిందని.. ఇంటి నుంచి పని చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలిగాయని ప్రతి ఐదుగురిలో ఇద్దరు పేర్కొన్నారు. మరి.. ఉద్యోగుల ఆశల్ని.. ఆకాంక్షల్ని కంపెనీలు ఏం చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.