Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. ఏపీలో కీలక కాంట్రాక్టు అదానీకే!

By:  Tupaki Desk   |   9 March 2023 12:05 PM GMT
తగ్గేదేలే.. ఏపీలో కీలక కాంట్రాక్టు అదానీకే!
X
అమెరికా ఆర్థిక పరిశోధన సంస్థ.. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఇటీవల అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ కంపెనీలపై సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూపు కంపెనీలు పలు అవకవతవకలకు పాల్పడుతున్నాయని.. కృత్రిమ పద్ధతుల్లో స్టాక్‌ మార్కెట్‌ లో షేర్లు పెరిగేలా అక్రమ పనులు చేస్తున్నాయని హిండెన్‌ బర్గ్‌ పేర్కొంది. దీంతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లో తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు అదానీ గ్రూపు కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయని వార్తలు వచ్చాయి. పలు దేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ గ్రూప్‌ తో ఇప్పటికే కుదుర్చుకున్న కాంట్రాక్టుల నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం గౌతమ్‌ అదానీపైనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో పలు పోర్టులను గౌతమ్‌ అదానీనే దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పతి సంస్థ.. జెన్‌ కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం విదేశీ బొగ్గు కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్‌ నే ఎంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా చాలా ఎక్కువ రేటుకు ఇచ్చారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.300 కోట్లు అదనపు భారం పడుతుందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

జెన్‌కో తరఫున విదేశీ బొగ్గు కొనుగోలు టెండరు కోసం.. టన్ను బొగ్గు రూ.13,100 చొప్పున గౌతమ్‌ ఆదానీ గ్రూప్‌ కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. దీంతో అదానీ సంస్థతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాగా దేశీయ బొగ్గును టన్ను రూ.5 వేలకు జెన్‌ కో కొంటోందని చెబుతున్నారు. దీని గ్రాస్‌ కెలోరిఫిక్‌ వాల్యూ (జీసీవీ) సుమారు 4 వేలుగా ఉందంటున్నారు. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు జీసీవీ మాత్రం 6,500 వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. చెల్లించే ధరతో పోలిస్తే, పెరిగే జీసీవీ తక్కువే అయినా.. 162% అధిక మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలనే ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా విదేశీ బొగ్గు టన్ను రూ.9 వేలకు మించి కొంటే భారమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌ అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం సుమారు రూ.300 కోట్లు అని తెలుస్తోంది. విదేశీ బొగ్గు కొనుగోలుకు రూ.982.50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అంటున్నారు.

కాగా ఏపీ జెన్‌ కో 10 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు గతంలో రెండుసార్లు టెండర్లు పిలిస్తే టన్ను బొగ్గుకు దాదాపు టన్ను రూ.18 వేల వరకు బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ ధర ఎక్కువని టెండర్లను జెన్‌ కో రద్దు చేసిందని గుర్తు చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులు, సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులు, విశాఖలో డేటా సెంటర్, పోర్టులను దక్కించుకున్న అదానీ సంస్థ.. జెన్‌ కో కు బొగ్గు సరఫరా టెండరునూ దక్కించుకోవడం గమనార్హం. ఇప్పుడు కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను అదానీకి అప్పగించడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో టన్ను రూ.7వేలకు దొరికే బొగ్గు.. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం తదితర కారణాలతో ప్రస్తుతం రూ.10–11వేల వరకూ ఉందని అంటున్నారు. దీనికి రవాణా ఖర్చులు, పోర్టు హ్యాండ్లింగ్‌ ఛార్జీలు కలిపినా గౌతమ్‌ అదానీ సంస్థ కోట్‌ చేసిన ధర టన్నుకు రూ.13,000 కొంచెం ఎక్కువేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.