Begin typing your search above and press return to search.

ఆ హైదరాబాదీ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు

By:  Tupaki Desk   |   18 Dec 2020 3:30 PM GMT
ఆ హైదరాబాదీ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు
X
హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అక్షరాల లక్ష కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏదంటే.. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే దివీస్ లేబొరేటరీస్. గురువారం స్టాక్ మార్కెట్ లో దివీస్ షేర్ ధర రూ.3800 మార్కును దాటింది. గురువారం మార్కెట్ ముగింపు సమయానికి ఆ షేర్ ధర రూ.3830. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.1,01,674 కోట్లకు చేరువైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన ఘనత సాధించిన ఫార్మా కంపెనీ ఇదే కావటం గమనార్హం. అంతేకాదు.. దేశంలో రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన రెండో ఫార్మా కంపెనీగా దివీస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ కంపెనీ తయారు చేసే యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్స్.. కస్టమ్ సింథసిస్ కార్యకలాపాలకు అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.

ఈ కంపెనీకి ఉన్న మరో సానుకూలత ఏమంటే.. అప్పు లేకపోగా.. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఇబ్బంది లేదు. దీనికి తోడు ఉత్పత్తి సామర్థ్యాన్ని యాజమాన్యం అంతకంతకూ విస్తరిస్తోంది. హైదరాబాద్ శివారులోని చౌటుప్పల్.. విశాఖపట్నం వద్ద ఉన్న యూనిట్ తో పాటు.. కాకినాడలో మరో కొత్త యూనిట్ ను నిర్మిస్తోంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో ఆ యూనిట్ కూడా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

2022 తర్వాత దివీస్ ల్యాబ్స్ ఆదాయం.. లాభాల్లో మరింత పెరుగుదల ఉంటుందన్న అంచనా వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2020 మొదట్లో ఈ షేర్ ధర రూ.1860 దగ్గర్లో ఉండేది. ఈ ఏడాది చివరికి దీని ధర రెట్టింపు కావటం గమానార్హం. కోవిడ్ కారణంగా దేశీయ ఫార్మా కంపెనీల అమ్మకాలు.. ఆదాయాలు బాగా పెరిగాయి. దీనికి తగ్గట్లే షేర్ ధరలు పెరగ్గా.. దివీస్ మరింత దూకుడు ప్రదర్శించింది. మొత్తానికి అరుదైన రికార్డును దివీస్ సొంతం చేసుకుందని చెప్పాలి.

ఇక.. ఈ కంపెనీవ్యవస్థాపకుడైన డాక్టర్ మురళి కే. దివి ముప్ఫై ఏళ్ల క్రితం ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 2003 ఫిబ్రవరిలో ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.10 ముఖ విలువ ఉన్న షేరును రూ.130కి జారీ చేసింది. 2007లో ప్రతి షేరును రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించింది. అంటే.. 2003లో ఒక షేరు కొన్న వారికి.. అది కాస్తా తర్వాత ఐదు షేర్లు అయ్యాయి. తదుపరి 2009లో ఒక షేరుకు మరో షేరు బోనస్ గా ఇచ్చింది. దీంతో.. ఐదు షేర్లు కాస్తా పది అయ్యాయి. ఇలా 2003లో ఈ కంపెనీకి చెందిన ఒక షేర్ కొన్న వారు 2009 నాటికి ఇరవై షేర్లు అయ్యాయి. ఇక.. లాభం ఎంత వచ్చిందో లెక్క వేసుకుంటే.. ఈ షేర్ ఎందుకు కొనలేకపోయామా అన్న బాధ పుట్టక మానదు. ఈ షేర్ కొని దాచి పెట్టుకున్నోళ్లను చూసి అసూయ చెందాల్సిందే.