Begin typing your search above and press return to search.

జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

By:  Tupaki Desk   |   15 Feb 2023 3:59 PM GMT
జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ!
X
జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ సంఘంపై చర్యలు తీసుకోవద్దని జగన్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల గవర్నర్‌ ను కలసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం ఆ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమకు సకాలంలో జీతాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. సూర్యనారాయణపై మండిపడ్డారు. ప్రభుత్వం సైతం గవర్నర్‌ ను కలవడం, రాజభవన్‌ ముందు మీడియాతో మాట్లాడటం ఉద్యోగుల సర్వీస్‌ రూల్సును ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

సూర్యనారాయణ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై హైకోర్టులో గతంలో వాదనలు కూడా జరిగాయి. ఈ పిటిషన్‌ను న్యాయవాది ఉమేష్‌ చంద్ర దాఖలు చేశారు. ఆయనతో పాటు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రకాష్‌ వాదనలు వినిపించారు.

వాదనల అనంతరం ధర్మాసనం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై స్టే విధించింది. దాంతో పాటు ఉద్యోగుల ప్రాథమిక హక్కులను మీరు ఎలా కాదంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది. నోటీసులపై స్టే విధిస్తూ.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.