Begin typing your search above and press return to search.

గుజ‌రాతీయులు తినే దానికే ప‌న్ను త‌గ్గిస్తారా?

By:  Tupaki Desk   |   8 Oct 2017 5:09 AM GMT
గుజ‌రాతీయులు తినే దానికే ప‌న్ను త‌గ్గిస్తారా?
X
జీఎస్టీ పేరుతో ముక్కుపిండి వ‌సూలు చేస్తున్న ప‌న్ను దెబ్బ‌కు దేశ ప్ర‌జ‌లంతా ఠారెత్తిపోతున్నారు. కొత్త ప‌న్ను విధానంలో త‌గ్గుతుంద‌ని భావించిన ప‌న్ను భారం అందుకు భిన్నంగా మంటెత్తిపోయేలా ఉంది. దీంతో జీఎస్టీ మోడీ స‌ర్కారుపై కొత్త అసంతృప్తిగా మారింది. జీఎస్టీతో అనుకున్న‌ది ఒక‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌టి కావ‌టంతో సామాన్యుడి ద‌గ్గ‌ర నుంచి వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అంద‌రూ చిరాకు ప‌డిపోతున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించి మోడీ స‌ర్కారు తాజాగా 27 వ‌స్తువులు.. వ‌స్తుసేవ‌ల మీద ప‌న్నుభారాన్ని త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ 27 వ‌స్తువుల్లో మోడీ కేరాఫ్ అడ్ర‌స్ అయిన గుజ‌రాతీయుల ప్ర‌ముఖ తినుబండారం ఒక‌టి ఉండ‌టం గ‌మ‌నార్హం. గుజ‌రాతీయులకు ప్ర‌ముఖ తినుబండార‌మైన ఖాక్రాపై మొద‌ట్లో వేసిన 12 శాతం ప‌న్నును 5 శాతానికి కుదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీనిపై ప‌లువురుఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌.. సోష‌ల్ మీడియాలో అయితే జోకులే జోకులు. వ్యంగ్యాస్త్రాల‌తో ఎట‌కారం చేసేసుకుంటున్నారు. గుజ‌రాతీయుల ఖాక్రా జాతీయ చిరుతిండిగా మారింద‌ని కొందరు వ్యాఖ్యానిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ రాష్ట్ర తినుబండారాల్ని మ‌ర్చిపోయేరేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

రానున్న రోజుల్లో గుజ‌రాత్ అసెంబ్లీకి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ మండిప‌డుతున్న వారు లేక‌పోలేదు. గుజ‌రాతీ అయిన మోడీ.. త‌న రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌ల చిరుతిండి మీద ప‌న్ను భారాన్ని త‌గ్గించార‌ని.. మ‌రి మిగిలిన రాష్ట్రాల వారు ఏం పాపం చేసుకున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఖాక్రాపై ప‌న్ను త‌గ్గించారు స‌రే.. మ‌రి పాప‌డ్ పై ప‌న్ను మాటేంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు.

ఖాక్రాపై త‌గ్గింపు నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల్ని చూస్తే.. ఖాక్రాపై జీఎస్టీ త‌గ్గించారు స‌రే.. దీనిపై మా గుజ‌రాతీ స్నేహితులు సంతోషంగా ఉన్నారు. మ‌రి.. పంజాబీ.. సింధీల సంగ‌తేంది? ఛోలే బ‌టూరే.. పాప‌డ్‌..కాజు క‌త్లీ మాటేంది? అని ఒకరు ప్ర‌శ్నిస్తే.. ఖాక్రా బాగా తిన్నా.. క‌డుపు నొప్పి పెట్టింది.. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళితే బిల్లు బాగా వేశాడు.. అదేమంటే స్టెత‌స్కోప్‌.. బీపీ మిష‌న్ జీఎస్టీ అని చెప్పాడంటూ ఎట‌కారం చేసుకున్నారు. చూస్తుంటే గుజ‌రాతీ అయిన మోడీకి.. త‌మ వాళ్లు తినే తిండి మీద ప‌డే భారం అర్థ‌మైన‌ప్పుడు.. మిగిలిన దేశ ప్ర‌జ‌లు ఏం పాపం చేశారంటారు?