విడుదల కు ముందే భారీ చర్చకు తెర తీసి.. వివాదాస్పదంగా మారిన 'ది కేరళ స్టోరీ' చిత్రం చుట్టూ దట్టమైన రాజకీయం మేఘాలు ముసురుకుంటున్నాయి. ఈ సినిమా చుట్టూ నెలకొన్న రాజకీయం పుణ్యమా అని అనూహ్య పరిణామాలకు తెర తీస్తోంది. గత వారాంతంలో విడుదలైన ఈ మూవీకి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఒకలాంటి పరిస్థితి నెలకొంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
మత మార్పిళ్లు.. ఉగ్రవాద కథాంశంతో వచ్చిన ఈ సినిమా పై బీజేపీయేతర పాలన ఉన్న కేరళ.. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్ లోని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే.. అందుకు భిన్నంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్.. ఉత్తరప్రదేశ్.. ఉత్తరాఖండ్ లో ఇందుకు ధీటుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. ఈ మూవీని సోమవారం టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి చూడటం తెలిసిందే.
యూపీ మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 12న లక్నోలోని థియేటర్ లో ప్రత్యేక షో వేయించుకొని మరీ చూడున్నారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా ఈ సినిమా ప్రదర్శనను నిలిపేస్తే.. తమిళనాడులో మాత్రం మల్టీఫ్లెక్సుల్లో ఈ మూవీని ప్రదర్శించటం లేదు. ద కశ్మీర్ ఫైల్స్ మాదిరి బెంగాల్ ఫైల్స్ అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని.. దీనికి బీజేపీ నిధులు సమకూరుస్తున్నట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె కు లీగల్ నోటీసులు పంపినట్లుగా ద కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి వెల్లడించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు కొలువు తీరిన రాష్ట్రాల్లోఈ సినిమా ప్రదర్శనపై ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వాలకు భిన్నంగా బీజేపీ పాలనలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ది కేరళ స్టోరీ చిత్రాన్ని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించటాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే కేంద్ర బోర్డు కు తప్పించి ఇంకెవరికి విడుదలను అడ్డుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ సినిమా చుట్టూ బోలెడంత రాజకీయం నడవటం మాత్రం ఖాయమని చెప్పాలి.