Begin typing your search above and press return to search.

ఆ ఏడుగురి విడుదల కోసం గవర్నర్‌ కు సీఎం వినతి !

By:  Tupaki Desk   |   30 Jan 2021 12:30 PM GMT
ఆ ఏడుగురి విడుదల కోసం గవర్నర్‌ కు సీఎం వినతి !
X
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో గత కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ముద్దాయిలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ను కోరారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్‌ సమావేశం తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గవర్నర్‌ తో భేటీ అయ్యారు. గతంలో ఆ ఏడుగురు విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున గవర్నర్‌ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకోనున్నందున వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని అభ్యర్ధించిన ఎడప్పాడి వినతి పత్రం కూడా అందజేసారు.

రాజీవ్‌ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్‌, మురుగన్‌, నళిని, శాంతను, జయకుమార్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, రవిచంద్రన్‌ ల విడుదలపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమేంటో తెలుసుకునేందుకు గవర్నర్‌ కార్య దర్శి ఆనంద్‌ రావ్‌ విష్ణుపాటిల్‌ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన అటార్నీ జనరల్‌ తో పాటు కేంద్ర న్యాయనిపుణులతోనూ శుక్రవారం భేటీ అయ్యారు. ఆ ఏడుగురి విడుదలకు వున్న అడ్డంకులు, వారిని విడుదల చేస్తే మున్ముందు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై ఆయన చర్చించారు. అదే విధంగా కేంద్రప్రభుత్వ ఉద్దేశం గురించి కూడా అటార్నీ జనరల్‌ తో చర్చించారు.

ఆయన ఢిల్లీ నుంచి వచ్చాక గవర్నర్‌ ఒకట్రెండు రోజుల్లో ఆ ఏడుగురి విడుదలకు సంబంధించి నిర్ణయం వెలువ రించవచ్చని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. రాజీవ్‌ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్‌ బృందం.. తమకు శిక్షా కాలం పూర్తయి నందున విడుదల చేయాలని, కనీసం క్షమాభిక్ష ప్రసాదించి అయినా విడిచిపెట్టాలంటూ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్రపతికి కూడా క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో అసెంబ్లీ లో తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపించినా అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ఈ వ్యవహారం పెండింగ్‌ లో వుండగానే పేరరివాలన్‌ బృందం మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తమ విడుదలకు సంబం ధించిన వ్యవహారంపై కేంద్రప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌ఫై గత వారం విచారణ జరగ్గా.. తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి వుందని, వారం రోజుల్లో ఆయన తగిన నిర్ణయం వెలువరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఖచ్చితంగా నిర్ణయం తీసు కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో ఈ వ్యవహారంలో న్యాయచిక్కులతో పాటు కేంద్రప్రభుత్వ ఉద్దేశం కూడా తెలుసు కునేందుకు గవర్నర్‌ తన కార్యదర్శిని ఢిల్లీకి పంపించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.