Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని... కేంద్రం ఎస్ అంటోందా....?

By:  Tupaki Desk   |   8 Feb 2023 3:13 PM GMT
విశాఖ రాజధాని... కేంద్రం ఎస్ అంటోందా....?
X
ఏపీకి రాజధాని ఏది అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఏపీ రాజధానిని ఆఖరుకు గూగులమ్మ కూడా చూపించలేని అతి పెద్ద కన్ఫ్యూజన్ ఉందని సెటరిలు కూడా పడుతున్నాయి. అలాంటి ఏపీకి విశాఖ పాలనా రాజధాని అవుతుంది అని జగన్ సర్కార్ చెబుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు నడుస్తోంది. అక్కడ తీర్పు తమకు అనుకూలంగా వస్తే మొత్తం సెటప్ తో విశాఖకు తరలిపోవడం వైసీపీ ప్లాన్ ఏ గా ఉంటే. ఒకవేళ ఏ కారణంగా అయినా మూడు రాజధానుల విషయంలో వ్యతిరేక తీర్పు వస్తే కనుక జగన్ క్యాంప్ ఆఫీస్ తో అక్కడ నుంచి పాలిస్తారు అని అంటున్నారు.

ఇక విశాఖ రాజధాని విష్యంలో కేంద్రం ఆలోచనలు ఏంటి అన్నది ఇక్కడ చర్చకు వస్తున్న విషయం. తాజాగా పెద్దల సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని చెప్పారు. అది తమ హక్కు అంటున్నారు. ఆ విధంగా కేంద్రం కూడా వ్యవహరించాలి అన్నది ఆయన వాదనగా కనిపిస్తోంది. ఇక కేంద్రం మనసులో ఏముందో పక్కన పెడితే జీ 20 సదస్సును రెండు రోజుల పాటు మార్చి నెలాఖరులో విశాఖలో నిర్వహిస్తున్నారు.

దేశమంతా వివిధ రాష్ట్రాలో జీ 20 సన్నాహక సదస్సులు జరుగుతున్నాయి. అయితే అవి ఆయా రాజధానులలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఏపీ సర్కార్ ఇక్కడే తెలివిగా వ్యవహరించి విశాఖలో సదస్సు పెట్టించింది. నిజానికి విజయవాడలోనూ ఈ సదస్సులు నిర్వహించవచ్చు. అయితే వైసీపీకి విశాఖ రాజధాని అన్నది కచ్చితమైన అభిప్రాయంగా ఉంది. దానికి కేంద్రం కూడా ఓకే అన్నట్లుగా విశాఖ ఎంపికను సమర్ధించినట్లుగానే కనిపిస్తోంది అంటున్నారు.

ఇక మరో విషయం తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సడెన్ గా హైదరాబాద్ నుంచి విశాఖకు షిఫ్ట్ కావాలని డిసైడ్ అయింది. ఇప్పటికి తొమ్మిదేళ్ళుగా ఏపీ తెలంగాణా విడిపోయినా హైదరాబాద్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్బీఐ విశాఖ దారి పట్టడం కూడా ఆసక్తికరమే. అప్పట్లో ఆర్బీఐ ప్రాంతీయ ఆఫీసు ఏపీలో ఎక్కడ పెడతారు అన్న ప్రశ్న వస్తే ఏపీ రాజధాని విషయం తేలిన తరువాత అని సమాధానం వచ్చేది. ఇపుడు ఆర్బీఐ విశాఖను ఎంచుకుంటోంది అంటే ఆ సిటీని రాజధానిగా గుర్తించినట్లేనా అన్నది మరో చర్చగా ఉందిపుడు.

నిజానికి దేశంలో ప్రతీ చోటా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు అన్నీ కూడా ఆయా రాజధాని నగరాల్లోనే ఉన్నాయి. ఏపీలో మాత్రం విశాఖలోనే పెడుతున్నారు అంటే రాజధాని విశాఖ అని భావిస్తున్నారా లేక మెగా సిటీ అని వస్తున్నారా అన్నది ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా ఆర్బీఐ ఆఫీస్ విశాఖకు షిఫ్ట్ కావడం వైసీపీ రాజధాని వాదనకు బలం చేకూరేలాగానే ఉంది అని అంటున్నారు. ఇక్కడ కూడా కేంద్రం విశాఖ సెలెక్షన్ ద్వారా విశాఖను ప్రమోట్ చేసిందా అన్నది కూడా చూడాలంటున్నారు.

ఇప్పటిదాకా బీజేపీ నేతలు అంతా అమరావతే మన రాజధాని అంటూ వచ్చారు. కానీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే రీసెంట్ గా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని అన్న దానికి కొత్త డెఫినిషన్ చెప్పారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్న చోట రాజధాని అనరని, సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ఆయన అంటున్నారు. అలా కనుక చూస్తే అమరావతిలోనే సచివాలయం ఉంటుంది కాబట్టి అదే రాజధాని అని ఆయన అంటున్నా ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలించవచ్చు అని చెప్పడం ద్వారా జగన్ విశాఖ మకాం ని ఇండైరెక్ట్ గా సమర్ధించినట్లుగానే ఉంది అని అంటున్నారు.

ఇక ముఖ్యమంత్రే విశాఖకు వెళ్తే ఆయన వెంటనే మంత్రులు అధికారులూ ఉంటారు, అలాంటపుడు సచివాలయం అన్నది పేరుకు అమరావతిలో ఉన్నా ఉపయోగం ఏంటి అన్నది మాత్రం బీజేపీ ఎంపీగారు చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక రాజధానుల ఎంపిక అన్నది రాష్ట్రాలకు సంబంధించిన మ్యాటర్ అని హై కోర్టులో విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది అని నాడు ప్రచారం జరిగింది. మరిపుడు సుప్రీం కోర్టులో కేంద్రం తన అఫిడవిట్ లో ఏమి చెబుతుంది అన్నదే కీలకమైన ప్రశ్న.

కేంద్రం కనుక రాజధానుల ఎంపిక రాష్ట్ర పరిధిలోనిది మాకు సంబంధం లేదు అన్నది కనుక చెబితే మాత్రం వైసీపీకి విశాఖకూ అనుకూలంగానే ఉంది అనుకోవాలి. లేకపోతే మాత్రం జగన్ కలలకు కళ్లెం వేసిందని భావించాలి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం స్పష్టం జగన్ విశాఖకు తరలి వచ్చి తన ఆఫీసు ని ప్రారంభించడానికి మాత్రం ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవు. సో విశాఖకు సీఎం మకాం కి మాత్రం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.