Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారు మరో వినూత్న పథకం.. ఖర్చు రూ.వెయ్యి కోట్లు

By:  Tupaki Desk   |   21 Dec 2020 6:00 AM GMT
ఏపీ సర్కారు మరో వినూత్న పథకం.. ఖర్చు రూ.వెయ్యి కోట్లు
X
చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రజాక్షేమం కోసం అవిశ్రాంతంగా పని చేస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ప్రజల నోళ్లలో నానుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఆయన సరికొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. వందేళ్ల తర్వాత ఏపీలో సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. దీంతో మరో అధ్యాయానికి తెర లేపినట్లైంది.

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద సర్వే ఆఫ్ ఇండియాతో కలిపి ఈ ప్రాజెక్టును చేస్తుననారు. ఇందుకోసం సదరు సంస్థతో అవగాహన ఒప్పందం కూడా చేసుకోవటం గమనార్హం. క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం.. తక్కెళ్లపాడు వద్ద ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని షురూ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారు? ఎన్ని దశల్లో చేస్తారు? దీనికి అయ్యే ఖర్చు ఎంత?దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలెన్నో బయటకు వస్తాయి.

ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4500 టీంలు పని చేయనున్నాయి. తొలిదశ సర్వే వచ్చే ఏడాది జులై వరకు.. రెండో దశ సర్వే వచ్చే ఏడాది అక్టోబరు వరకు సాగుతుంది. చివరిదైన మూడో దశ సర్వే జులై 2022 నుంచి 2023 వరకు సాగుతుంది.ఈ పథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 వేల గ్రామాల్లోని 2.26 కోట్ల ెకరాల భూమిని.. 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తులు.. 110 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తులతో పాటు 10 లక్షల ప్లాట్లలోనూ ఈ సర్వే నిర్వహించనున్నారు.

ఈ పథకంలో భాగంగా అసలేం చేయనన్నారన్న విషయానికి వస్తే.. గ్రామ.. వార్డుసచివాలయ కార్యదర్శి.. సర్వేయర్లతో కూడిన టీంలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్. కార్స్.. రోవర్ లాంటి పరికరాలతో ప్రతి స్థిరాస్తిని కచ్ఛితమైన భూ అక్షాంశ - రేఖాంశాలతో సర్వే రిపోర్టుల్ని తయారు చేస్తార. ప్రతి యజమానికి ఆ వివరాల్ని నోటీసు ద్వారా తెలియజేస్తారు. ఏదైనా అభ్యంతరం ఉంటే గ్రామసచివాలయంలో అప్పలు చేసుకుంటే.. వాటిని సత్వరం పరిష్కారమయ్యేలా మొబైల్ మెజిస్ట్రేట్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రాన్ని అందజేయనున్నారు. ఈ మొత్తం పథకం కోసం రూ.వెయ్యి కోట్లను జగన్ ప్రభుత్వం ఖర్చు చేయనంది.