Begin typing your search above and press return to search.

అందుకే వైసీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లా.. జగన్ రియాక్షన్ ఇదే

By:  Tupaki Desk   |   17 April 2023 10:07 AM GMT
అందుకే వైసీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లా.. జగన్ రియాక్షన్ ఇదే
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాజాగా మరోసారి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన ఆయన.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా తనకు ఎదురైన ప్రశ్నలన్నింటికి మొహమాటం లేకుండా సమాధానాలు ఇచ్చేశారు. ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ లోకి వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి.. పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నమ్మిన జగన్ ను ఆయన ఎందుకలా వ్యవహరించారు? లాంటి వాటికి సమాధానాలు చెప్పేశారు.

తాను అప్పటి టీఆర్ఎస్ లో చేరే నాటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని. ఎంపీని అన్న విషయాన్ని గుర్తు చేసిన పొంగులేటి.. అప్పట్లో తనతో 300 మందికి పైగా వివిధ స్థాయి నేతలు తాను పార్టీ మారిన వేళలో మారారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ అందరికి కౌంట్ డౌన్ మొదలైందని. ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయంగా దెబ్బ తీసే ప్రయత్నాలతో పాటు. పోలీసు కేసులు పెట్టించే ప్రయత్నాలు తీవ్రం కావటంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. రాజకీయంగా శక్తిమంతుడు తనకు ఎప్పటికైనా ఇబ్బందే అన్నది కేసీఆర్ తీరుగా చెప్పుకొచ్చారు.

తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినందుకు అస్సలు చింతించటం లేదన్న ఆయన.. రావణాసురుడి కబంధ హస్తాల నుంచి బయటపడినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను పార్టీ మారే ముందు.. తమ పార్టీ అధినేత జగన్ ను కలవటానికి వెళ్లానని.. ఆయనకు తాను పార్టీ మారుతున్న విషయాన్ని చెప్పేందుకు వెళ్లినా.. చెప్పలేకపోయినట్లు చెప్పారు.

తాను పార్టీ మారిన ఆర్నెల్లకు ఢిల్లీలో జగన్ ను కలిశానని.. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయిందన్నారు. రెండేళ్ల తర్వాత మరోసారి ఢిల్లీలో కలిసినప్పుడు తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నావన్న ఆయన.. 2019 ఎన్నికల తర్వాత విజయవాడలో కలిసినప్పుడు తనకు తెలంగాణ రాజకీయాల మీద ఆసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు.

తనకు టీఆర్ఎస్ తో సంబంధాలు ఎలా మొదలయ్యాయో పొంగులేటి చెప్పుకొచ్చారు. '2014 ఎన్నికల్లో ఫలితాలు ఇంకా రాలేదు. కేటీఆర్.. జగదీశ్ రెడ్డిలు నన్నుసంప్రదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారికి కొన్ని సీట్లు తక్కువ పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వైసీపీ ఐదు సీట్లు గెలవబోతున్నట్లు చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అలా కేసీఆర్ తో పరిచయమైంది. నాకు పదవి ఇవ్వకున్నా.. మా వాళ్లను ఇబ్బంది పెట్టినా.. కేటీఆర్ ను చూసే ఇన్నాళ్లు పార్టీలో ఉన్నా. నన్ను కాపాడేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది' అని చెప్పారు. 2019లో నాకు టికెట్ ఇవ్వాలని జగన్ తో కేసీఆర్ కు ఫోన్ చేయించాను కానీ అందుకు కేసీఆర్ నో చెప్పారంటూ మరో కీలక విషయాన్ని వెల్లడించారు.