Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్-రష్యా మధ్య ఆ కీలక నగరం.. యుద్ధం అటో ఇటో

By:  Tupaki Desk   |   9 March 2023 5:08 PM GMT
ఉక్రెయిన్-రష్యా మధ్య ఆ కీలక నగరం.. యుద్ధం అటో ఇటో
X
13 నెలలు కావొస్తోంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై.. విజేత ఎవరో తెలియదు కానీ.. రెండు దేశాలూ పరాజితులే.. బాధితులు ప్రజలే. లక్షల కోట్ల ఆస్తి నష్టం.. లక్షల ప్రాణాలు బలి.. భవనాలు, ఇళ్లు, మౌలిక వసతులు ధ్వంసం.. చెప్పలేనంత నష్టం.. కోలుకోలేనంత కష్టం.. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా.. ఉక్రెయిన్ కోలుకోవడానికి మరో 50 ఏళ్లయినా పట్టొచ్చేమో? అన్నట్లున్నాయి పరిస్థితులు. మరోవైపు యుద్ధంలో రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.

వేసవి మొదలు.. దాడులు తీవ్రం?

అన్నిటికిమించి ఉక్రెయిన్-రష్యాల్లో శీతాకాలం ముగిసింది. వేసవి వచ్చేస్తోంది. యుద్ధం సాగించడం మహా కష్టమైన చలికాలంలోనూ దాడులు ఆగలేదు. ఇక వేసవి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. దీనికితగ్గట్లే.. యుద్ధం ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ గత నెలలో ప్రకటించాడు. పాశ్చాత్య దేశాలపై ఆయనకు ఉన్న కోపాన్ని చూస్తుంటే యుద్ధం ఆగదని కూడా తేలిపోతోంది.

ఆ ప్రాంతం దక్కితే ఆగిపోతుందా..?

ఉక్రెయిన్ ను భౌగోళికంగా చూస్తే తూర్పు, పశ్చిమ ప్రాంతాల గురించి చెప్పుకోవాలి. తూర్పు ప్రాంతమంటే డాన్ బాస్, క్రిమియా (రష్యా ఆక్రమణలో ఉంది). దక్షిణంలో ఒడెస్సా, జాపొరిజ్జియా ఉన్నాయి. ల్వీవ్, రాజధాని కీవ్ పశ్చిమ ప్రాంతం కిందకు వస్తాయి. తూర్పు ప్రాంతం పారిశ్రామికంగా, వనరులపరంగా సుసంపన్నం. అందులోనూ ఆ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడేవారు అధికం. ఇప్పటికే డాన్ బాస్ లో కొంతభాగం రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. క్రిమియాను ఎలాగూ తొమ్మిదేళ్లుగా రష్యానే గుప్పిట పట్టింది.

ఇప్పుడు లక్ష్యం అదే.. దాన్ని ఆక్రమిస్తే రష్యాకు అడ్డులేనట్లే రష్యా.. ఉక్రెయిన్ లోని బక్ముత్‌ నగరం వద్ద పోరాడుతోంది. దానిని స్వాధీనం చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే.. తూర్పు ఉక్రెయిన్ కు బక్ముత్ ముఖద్వారం. ఈ నగరాన్ని ఆక్రమిస్తే.. తూర్పు ఉక్రెయిన్‌ కీలక నగరాల్లో దూసుకెళ్లడానికి రష్యాకు అడ్డు ఉండదు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నే ఈ మాట అన్నారు. 'బక్ముత్‌ తర్వాత రష్యా బలగాలు ఇతర ప్రాంతాల్లోకి దూసుకెళ్లగలవని మాకు అర్థమైంది. దొనెట్స్క్‌ దిశగా బక్ముత్‌ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకుపోవడానికి వారికి సులువవుతుంది' అని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు బక్ముత్‌ పుతిన్‌ సేనల ముట్టడిలో ఉంది. రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్‌ వద్ద పోరాడుతోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. దాంతో పెద్దసంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.

మరో మరింకనే.. 'ఇటీవల నేను భద్రతా బలగాల చీఫ్‌తో సమావేశమయ్యాను. బక్ముత్‌ వద్ద దృఢంగా నిలబడాల్సి ఉందని ఆ సమావేశంలో సైన్యం వెల్లడించింది. కానీ మేం మా సైనికులు ప్రాణాల గురించి ఆలోచించాలి. అలాగే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి. అక్కడి నుంచి రష్యా ఏం కోరుకుంటుందో మొదట అర్థం చేసుకోవాలి. రష్యా ఒక చిన్న విజయమైనా సాధించాలని కోరుకుంటోంది. బక్ముత్‌లో అంతా నాశనం చేసి, సామాన్య ప్రజలందరిని చంపేసి దానిని దక్కించుకోవాలనుకుంటోంది' అని జెలెన్‌స్కీ అంటున్నారు. కాగా, రష్యా తూర్పు బఖ్‌ముట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.