Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌ లోకి ఆ మాజీ ముఖ్యమంత్రి!

By:  Tupaki Desk   |   26 Jan 2023 2:00 PM GMT
బీఆర్‌ఎస్‌ లోకి ఆ మాజీ ముఖ్యమంత్రి!
X
ఒడిశాలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, 9సార్లు ఎంపీగా గెలుపొందిన గిరిధర్‌ గమాంగ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. అలాగే ఆయనతోపాటు ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌ కూడా బీజేపీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు గిరిధర్‌ గమాంగ్‌ తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. కాగా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరనున్నారు. ఇటీవల గిరిధర్‌ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్‌ హైదరాబాద్‌ వచ్చి ప్రగతి భవన్‌ లో కేసీఆర్‌ తో సమావేశమైన సంగతి తెలిసిందే.

కాగా గిరిధర్‌ గమాంగ్‌ 2015లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. గిరధర్‌ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌ త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారని వార్తలు సమాచారం.

కాగా ఎస్టీ సామాజికవర్గానికి చెందిన గిరిధర్‌ గమాంగ్‌ ఒడిశా రాజకీయాల్లోనే కాకుండా దేశంలోనూ విలక్షతను చాటుకున్నారు. 1999లో ఓవైపు ఒడిశాలో కాంగ్రెస్‌ ఎంపీగానూ, ఒడిశా ముఖ్యమంత్రిగానూ ఏకకాలంలో ఉన్నారు. ఆ సమయంలో కేంద్రంలో అటల్‌ బిహార్‌ వాజపేయి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అధికార, ప్రతిపక్ష సభ్యుల ఓట్లు సమానమయ్యాయి. దీంతో ఒడిశా సీఎంగానూ, కాంగ్రెస్‌ ఎంపీగానూ ఉన్న గిరిధర్‌ గమాంగ్‌ ఆత్మసాక్షి మేరకు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నానంటూ లోక్‌ సభలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పతనమైంది. ఏడాదికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత గిరిధర్‌ గమాంగ్‌ నిర్ణయంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన నైతికతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తాయి. ఓవైపు ఒడిశా సీఎంగా ఉంటూ ఎంపీగా లోక్‌ సభలో ఆయన ఓటు ఎలా వేస్తారనే విమర్శల జడివాన కురిసింది.

కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంతరాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి విజయం సాధించారు. 1999లో ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ సైతం 1999లో ఎంపీగా గెలుపొందారు.

కాగా బీజేపీ తమను పట్టించుకోవడం లేదని గిరిదర్‌ గమాంగ్‌ ఆరోపించారు. తనకు గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని చెప్పి అసెంబ్లీకి పోటీ చేయించిందని విమర్శించారు. బీజేపీ సమావేశాలకు సైతం తనకు చివరి నిమిషంలో ఆహ్వానం అందుతోందని మండిపడ్డారు. తమకు బీజేపీలో ఏమాత్రం గౌరవం దక్కట్లేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.