దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఇంకా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు అన్ లాక్ దిశగా ముందుకెళ్తున్నాయి. అయితే , లాక్ డౌన్ ఉన్నప్పటికీ పెళ్లిళ్లు, అంత్యక్రియలకు మాత్రం అనుమతి ఉంది. ఐతే పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. కానీ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా వరాసియోనీ పట్టణ అధికారులు మాత్రం మరో కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వధూవరులకు ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉండాలి. అంటే వారిద్దరు వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలి. లేదంటే పెళ్లికి అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు.
వ్యాక్సినేషన్ ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఈ కరోనా సమయంలో పెళ్లిళ్లు జరగాలంటే మధ్యప్రదేశ్‌లో ముందుస్తు అనుమతులు తప్పనిసరి. అనుమతులు ఇవ్వాలంటే తాము సూచించిన డాక్యెమెంట్లు చూపించాల్సిందేనని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సందీప్ సింగ్ స్పష్టం చేశారు. అందులో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. వధూ వరులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. అధికారులు తెచ్చిన ఈ నిబంధనపై వరాసియోనీ ప్రజలు మండిపడుతున్నారు. ఇదెక్కడి నిబంధన, దేశంలో ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నారు. శుక్రవారం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కఠినమైన నిబంధనలు అమలవుతున్నాయి. అత్యవసర సేవలను మినహా ఎవరినీ బయటకు రానీయడం లేదు. జూన్ 15 వరకు మధ్యప్రదేశ్‌లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. లాక్‌డౌన్తో అక్కడ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటివిటీ రేటు 1.6శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96శాతానికి పైగా ఉంది. ఈ క్రమంలోనే కొంత వరకు ఆంక్షలను సడలిస్తున్నారు. ఐతే వరాసియోనీలో పెళ్లిళ్లకు కరోనా టీకాలకు ముడిపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో గురువారం 846 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 3,746 మంది కోలుకోగా, మరో 50 మంది మరణించారు. తాజా లెక్కలతో మధ్యప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,82,945కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 7,60,552 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 8,207 మంది మరణించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 14,186 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.