Begin typing your search above and press return to search.

అడిగినప్పుడు ఔట్ ఇవ్వకుంటే అంపైర్ ను బూతులు తిట్టేయటమా?

By:  Tupaki Desk   |   10 Jan 2021 5:37 AM GMT
అడిగినప్పుడు ఔట్ ఇవ్వకుంటే అంపైర్ ను బూతులు తిట్టేయటమా?
X
జెంటిల్ మెన్ ఆటగా కీర్తించే క్రికెట్ తో.. మర్యాదలు తగ్గిపోయి చాలా కాలమే అయిపోయింది. దురుసుగా వ్యవహరించటం.. స్లెడ్జింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. పద్దతి పాడు లేకుండా గ్రౌండ్లో ఆవేశాల్ని ప్రదర్శించటం ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో ఎప్పుడో ఒకసారి.. అది కూడా చాలా కీలకమైన మ్యాచ్ లోనో.. భావోద్వేగం ఉన్న మ్యాచుల్లో తప్పించి క్రికెటర్లు తొందరపడి సహనం కోల్పోయేవారు కాదు. కానీ.. ఇప్పుడు అలా కాదు.. ఆటగాళ్లకు ఆవేశం తరచూ వచ్చేస్తోంది.

తాజాగా అలాంటి సీన్ ఒకటి టీమిండియా వర్సెస్ ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 53వ ఓవర్లో లయన్ బౌలింగ్ లో పూజారా బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊమించని విధంగా టర్న్.. బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి పూజారా శరీరాన్ని తాకి.. షార్ట్ లెగ్ లో గాల్లోకి లేచింది. దీంతో.. అక్కడే ఫీల్డ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్ పట్టుకున్నాడు.

ఔట్ అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ అప్పీల్ చేశారు. అయితే.. ఫీల్డ్ అంపైర్ ఔట్ అప్పీల్ ను రిజెక్టు చేసి.. తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్ కు నిర్ణయాన్ని ఇచ్చారు. అయితే.. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్నే థర్డ్ అంపైర్ ఇచ్చారు. దీన్ని అంగీకరించలేని పైన్ అసహనం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టేశాడు.

దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన అంపైర్.. ‘ ఆ నిర్ణయం నాది కాదు. థర్డ్ అంపైర్ తీసుకున్నారు’ అంటూ గట్టిగానే చెప్పారు. అవుట్ అన్నంతనే ఔట్ ఇచ్చేయాలనుకోవటం తప్పుకదా? థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కూడా ఆవేశానికి గురి కావటం ఏ మాత్రం మంచి అభిప్రాయం కాదన్నది మర్చిపోకూడదు. మరి.. ఇలాంటి వాటిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.