Begin typing your search above and press return to search.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందిలో 10 మంది బాల్యస్నేహితులే

By:  Tupaki Desk   |   16 Jan 2021 5:34 AM GMT
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందిలో 10 మంది బాల్యస్నేహితులే
X
కర్ణాకటలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. అయ్యో అనిపించే ఈ దారుణ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. వారి నేపథ్యం గురించి తెలిసినంతనే తీవ్ర విషాదంలో మునిగిపోవటమే కాదు.. అప్రయత్నంగా కంటి వెంట కన్నీళ్లు రావటం కనిపిస్తోంది. మొత్తం పదమూడు మంది ప్రాణాల్ని తీసిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బాల్యస్నేహితురాళ్లు అక్కడిక్కడే మరణించగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇంకొందరు తీవ్రగాయాల పాలయ్యారు.

వారంతా 20 ఏళ్ల క్రితం నాటి బాల్య స్నేహితులు. సంక్రాంతి సందర్భంగా గోవా ట్రిప్ కు ప్లాన్ చేశారు. కర్ణాటకలోని దావణగెరె నుంచి బయలుదేరారు. డ్రైవర్.. మరో పదహారేళ్ల అమ్మాయితో పాటు.. 16 మంది బాల్యస్నేహితురాళ్లతో కూడిన మినీ బస్సు బయలుదేరింది. ఈ ప్రయాణానికి ముందు.. తామంతా కలిసిన దానికి గుర్తుగా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. పాత గురుతుల్ని గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ.. హ్యాపీగా గడిపారు. వారి ప్రయాణం మొదలై.. మరికాసేపట్లో మరో స్నేహితురాలి ఇంట్లో టిఫిన్ కోసం ఆగాల్సిన సమయంలోనే ఘోర ప్రమాదానికి గురయ్యారు.

ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి టెంపో ట్రావెలర్ మినీ బస్సును ఢీ కొంది. ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన మినీ బస్సును టిప్పర్ అత్యంత వేగంగా ఢీ కొట్టింది. దీంతో.. ఘటనాస్థలంలోనే ఆరుగురు కన్నుమూయగా.. మరో ఏడుగురు ఆసుపత్రిలో మరణించారు. వీరంతా దావణగెరెలోని విద్యానగరకు చెందిన వారుగా గుర్తించారు. మరణించిన వారంతా నగరంలోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన ఒకప్పటి విద్యార్థులు. వారంతా సంక్రాంతి సందర్భంగా గురువారం అర్థరాత్రి దావణగెరె నుంచి గోవాకు బయలుదేరారు. తెల్లవారుజామున ధార్వాడకు సమీపంలోని ఇడగట్టి వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ వారి ప్రాణాల్ని తీసింది.