Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఘోరం.. 13 మంది మృతి

By:  Tupaki Desk   |   19 Jan 2021 3:45 AM GMT
గుజరాత్ లో ఘోరం.. 13 మంది మృతి
X
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని కిమ్ చార్ రాస్తా వద్ద చోటుచేసుకుంది.

ట్రక్కు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో రెప్పపాటులో దారుణం జరిగిపోయింది. ఓ ట్రాక్టర్ ను ఢీకొట్టిన ట్రక్కు.. అదుపుతప్పి, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మరణించిన వారంతా రాజస్థాన్ కు చెందిన కూలీలుగా గుర్తించారు.

మొదట ట్రక్కు చెరుకుతో లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టిందని, దాంతో అదుపుతప్పిన ట్రక్కు.. పక్కనే ఉన్న ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఆరుగురు గాయపడ్డారని వెల్లడించారు.

రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లాకు చెందిన కార్మికులు.. పొట్టకూటి కోసం గుజరాత్ రాష్ట్రానికి వలస వచ్చారు. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.