Begin typing your search above and press return to search.

శశికళ రిసార్ట్స్ దగ్గర ఉద్రిక్తత..ఎందుకో తెలుసా ?

By:  Tupaki Desk   |   8 Feb 2021 7:04 AM GMT
శశికళ రిసార్ట్స్ దగ్గర ఉద్రిక్తత..ఎందుకో తెలుసా ?
X
చెన్నై చిన్నమ్మ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బస చేసి రిసార్ట్స్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. అక్రమాస్తుల ఆర్జన ఆరోపణలు రుజువ్వటంతో బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు శశికళ అండ్ కో కు నాలుగేళ్ళు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్షతో పాటు కోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమానా చెల్లించటంతో వారం క్రితమే జైలుశిక్ష పూర్తిచేసుకుని విడుదలయ్యారు.

అయితే జైలులో ఉన్నపుడే కరోనా వైరస్ సోకటంతో ఈమెను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఉన్నపుడే జైలునుండి విడుదలయ్యారు. వెంటనే చెన్నైకి వెళ్ళే అవకాశం లేకపోవటంతో బెంగుళూరు శివార్లలోని ఓ రిసార్స్ట్ లో బసచేశారు. రిసార్ట్స్ లో బస చేయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో హోం క్వారంటైన్, రెండోదేమో జ్యోతిష్కుల సలహా.

7వ తేదీలోగా చెన్నైలోకి ప్రవేశించవద్దని జ్యోతిష్కుల సలహా ఇవ్వటంతో శశికళ రిసార్ట్స్ లో ఉండిపోయారు. ఇక ఆమె చెన్నైకి చేరుకోవటానికి రెడీ అవుతున్న సమయంలో ఆదివారం ఒక్కసారిగా రిసార్ట్స్ దగ్గర ఉద్రిక్తతలు మొదలైపోయాయి. దీనికి కారణం ఏమిటయ్యా అంటే ఆమెకు భారీ ఎత్తున స్వాగతద్వారాలు, జేజేలు కొడుతు పెద్ద పెద్ద హోర్డింగులు వెలవటమే. ఆమె కోసం ఏర్పాటు చేసిన హోర్డింగులన్నీ తమిళంలోనే ఉన్నాయి.

శశికళతో పాటు మద్దతుదారులందరూ తమిళులే కావటంతో సహజంగానే హోర్డింగులన్నీ తమిళంలోనే ఉన్నాయి. తమ గడ్డపై తమిళంలో హోర్డింగులు వెలవటాన్ని కన్నడిగులకు నచ్చలేదు. మొదటినుండి తమిళనాడు-కర్నాటక రాష్ట్రాల మధ్య భాషకు సంబంధించిన గొడవలు చాలానే జరుగుతున్నాయి. రిసార్ట్స్ నుండి చెన్నై వరకు శశికళ వర్గం భారీ ఎత్తున వేలాది జైంట్ సైజ్ హోర్డింగులను ఏర్పాటు చేశారు.

నిజానికి గతంలో జరిగిన గొడవలకు ఇప్పటి శశికళ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగులకు అసలు సంబంధమే లేదు. అయినా కన్నడగడ్డలో ఉంటు తమిళంలో హోర్డింగులు పెట్టడం ఏమిటంటు కొందరికి మండిపోయింది. దాంతో హోర్డంగులపై దాడులు చేసి ద్వంసం చేసేశారు. దీంతో శశికళ మద్దతుదారులు, హోర్డింగులను ఏర్పాటు చేసిన వాళ్ళు ఎదురుదాడులు చేయటంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. అయితే పోలీసుల జోక్యంతో పరిస్ధితులు సద్దుమణిగాయి.