Begin typing your search above and press return to search.

ప‌రిష‌త్ ప‌రేషాన్ః ఏపీలో అధికారుల పాల‌న ఆర్నెల్ల పొడిగింపు.. అభ్య‌ర్థుల్లో టెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   3 July 2021 10:19 AM GMT
ప‌రిష‌త్ ప‌రేషాన్ః  ఏపీలో అధికారుల పాల‌న ఆర్నెల్ల పొడిగింపు.. అభ్య‌ర్థుల్లో టెన్ష‌న్‌!
X
ఏపీలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ఎప్పుడు తేలుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. రూల్స్ కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లు నిర్వ‌హించార‌ని ఆరోపిస్తూ ప్ర‌తిప‌క్షాలు వేర్వేరుగా హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసుల‌ను విచారించిన సింగిల్ బెంచ్‌.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను నిలిపేయాలని, ప‌రిష‌త్‌ ఎన్నికలను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే.. సింగిల్ బెంచ్ ఇచ్చిన‌ తీర్పును రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం డివిజ‌న్ బెంచ్ ముందు స‌వాల్ చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిష‌త్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన నిబంధ‌న‌లను ఉల్లంఘించార‌ని, పోలింగ్ తేదీ నాటికి కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోలేద‌ని విప‌క్షాలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఇది ఖ‌చ్చితంగా సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్ల‌ఘించ‌డ‌మేన‌ని టీడీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. అత్యున్న‌త ధ‌ర్మాస‌నం ఆదేశాల‌ను ఖాత‌రు చేయ‌కుండా నిర్వ‌హించిన ఈ ఎన్నిక‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌నసేన పార్టీలు కూడా కోర్టుకు వెళ్లాయి. వీరి పిటిష‌న్ల‌ను సింగిల్ బెంచ్ వేర్వేరుగా విచారించింది. టీడీపీ ఫిర్యాదులో ఎన్నిక‌ల కౌంటింగ్ ఆపాల‌ని.. జ‌న‌సేన‌, బీజేపీ ఫిర్యాదులో ఎన్నిక‌ల‌నే ర‌ద్దు చేయాల‌ని ఆదేశించింది. దీంతో.. ఎన్నిక‌ల సంఘం డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం ఈ కేసు న‌డుస్తోంది.

ఇదిలాఉంటే.. ప్ర‌త్యేక అధికారుల పాల‌నలోనే ప‌రిష‌త్ లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల ఫ‌లితాల కేసు కోర్టులో ఉండ‌డం.. అధికారుల పాల‌న‌కు గ‌డువు ముగుస్తుండ‌డంతో.. అనివార్యంగా మ‌రో ఆర్నెల్ల పాటు అధికారుల పాల‌న‌ను పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది. అంటే..రాబోయే ఆరు నెల‌ల కాలంపాటు ప‌రిష‌త్ ల‌ను అధికారులే పాలించ‌నున్నారు.

ఈ ప‌రిస్థితి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పోటీచేసిన వారికి ఇబ్బందిగా త‌యారైంది. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. లక్ష‌ల్లో ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. చాలా మంది అప్పులు తెచ్చి ఎన్నిక‌ల గండం గ‌ట్టెక్కి ఉంటారు. ఇప్పుడు వీరంద‌రిలోనూ టెన్ష‌న్ కొన‌సాగుతూనే ఉంది. ఈ కోర్టు తీర్పు ఎప్పుడు వ‌స్తుందో? ఫ‌లితాలు ఎప్పుడు విడుద‌ల అవుతాయోన‌ని ఎదురు చూస్తున్నారు.

అంతేకాదు.. మ‌రో స‌మ‌స్య కూడా వారిని వెంటాడుతోంది. ఫ‌లితాలు వ‌స్తే.. గెలుస్తామా? ఓడుతామా? అనే భ‌యం ఒక‌వైపు ఉంటే.. ఒక‌వేళ న్యాయ‌స్థానం మొత్తం ఎన్నిక‌నే ర‌ద్దు చేస్తే ప‌రిస్థితి ఏంట‌నే భ‌యం కూడా వారిని కుదురుగా నిల‌వ‌నీయ‌ట్లేదు. న్యాయ‌స్థానం తుది తీర్పు వెలువ‌రిస్తే గానీ.. ఈ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌దు.