Begin typing your search above and press return to search.

రేప్ గాళ్ల డిటైల్స్ తో స‌రికొత్త వెబ్ సైట్!

By:  Tupaki Desk   |   22 May 2018 4:13 AM GMT
రేప్ గాళ్ల డిటైల్స్ తో స‌రికొత్త వెబ్ సైట్!
X
ప‌శువుల కంటే ఘోరంగా.. అమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించే మాన‌వ మృగాల వివ‌రాలు తెలిసేలా.. వారి దారుణాల‌పై ప్ర‌పంచానికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న అత్యాచార దారుణాల‌కు పాల్ప‌డే వారి వివ‌రాలు అంద‌రికి తెలిసేలా చేయాల‌ని భావిస్తోంది. రేప్ దారుణాలు అంత‌కంత‌కూ ఎంత ఎక్కువ అవుతుంద‌న్న విష‌యంపై తాజాగా కొన్ని గ‌ణాంకాల్ని విడుద‌ల చేశారు. ఏడేళ్ల క్రితం 24,206 మంది లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డగా.. ఒక్క 2017లో 96,036 మంది లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన వైనాన్ని గుర్తించారు.

ఇలాంటి దారుణ నేరాల‌కు పాల్ప‌డే వారికి ముకుతాడు వేసేలా.. ఆ దుర్మార్గుల‌కు సాకిచ్చేలా ఒక ప్ర‌త్యేక వెబ్ సైట్ ను త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసింది. నేష‌న‌ల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్సువ‌ల్ అఫెండ‌ర్స్ పేరిట ఒక డేటాబేస్ ఏర్పాటు చేసి.. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించారు. దీంతో.. లైంగిక వేధింపు దారుణాల‌కు పాల్ప‌డే వారి వివ‌రాల్ని స‌ద‌రు సైట్ లో ఉంచాల‌ని భావిస్తున్నారు.

ఈ త‌ర‌హా నేరాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు వీలుగా.. ఇలాంటి దారుణాల‌కు పాల్పడే వారి జాబితాను బ‌య‌ట‌కు తెలియ‌జేయ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేలా నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేష‌న్ల‌లో మ‌హిళ‌లు.. చిన్నారుల‌పై లైంగిక వేధింపులు.. అత్యాచారాల‌కు పాల్ప‌డిన వివ‌రాల్ని ఒకే చోట రిజిస్ట‌ర్ చేస్తారు. వారి ఫోటోలు.. వివ‌రాల్ని అందులో పేర్కొంటారు. వారిపై న‌మోదైన కేసులు.. వారికి కోర్టులు విధించిన శిక్ష‌ల డిటైల్స్ ను అందులో న‌మోదు చేయ‌నున్నారు.

ఈ వెబ్ సైట్‌లో మొద‌టిసారి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన నిందితుల వివ‌రాల్ని 15 సంవ‌త్స‌రాల పాటు వెబ్ సైట్ లో ఉంచాల‌ని నిర్ణ‌యించారు. ప‌దే ప‌దే లైంగిక అత్యాచారాల‌కు పాల్ప‌డే వారి వివ‌రాల్ని పాతికేళ్ల పాటు ఉంచాల‌ని నిర్ణ‌యించారు. 12 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న బాలిక‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన వారి డేటాను పాతికేళ్లు ఉంచాల‌ని.. త‌ర‌చూ నేరాల‌కు పాల్ప‌డే వారు.. కిరాత‌క‌మైన అత్యాచారాలు.. గ్యాంగ్ రేపులు.. క‌స్టోడియ‌ల్ రేపులు.. రేప్ అండ్ మ‌ర్డ‌ర్ కేసులు చేసే వారి వివ‌రాల్ని జీవితాంతం వెబ్ సైట్లో ఉంచేస్తారు. ఒక‌వేళ అత్యాచార కేసుల్ని కోర్టు కొట్టేస్తే మాత్రం వారి పేర్ల‌ను.. వివ‌రాల్ని వెబ్ సైట్ నుంచి తొల‌గించ‌నున్నారు.

అదే స‌మ‌యంలో మ‌హిళ‌లు.. చిన్నారుల‌పై లైంగిక వేధింపులు.. అత్యాచారాల‌కు పాల్ప‌డే వారి వివ‌రాల్ని అన్ని పోలీస్ స్టేష‌న్ల‌కు అందుబాటులో ఉంచ‌టం ద్వారా నేర‌స్తుల‌పై నిఘా పెట్టేందుకు.. వారు మ‌ళ్లీ త‌ప్పులు చేసేందుకు అవ‌కాశం లేకుండా చేస్తార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ నేర‌స్తుల జాబితాను అంత‌ర్జాతీయ పోలీసుల‌కు అందుబాటులో ఉంచాల‌ని భావిస్తున్నారు. అంతేకాదు.. లైంగిక వేధింపుల‌కు గురి చేసే నిందితుల‌పై వేధింపు షీట్స్ తెర‌వాల‌ని నిర్ణ‌యించారు. ఈ వెబ్ సైట్ ను నేష‌న‌ల్ ఆటోమేటెడ్ ఫింగ‌ర్ ప్రింట్స్ ఐడెంటిఫికేష‌న్ సిస్ట‌మ్‌ కు అనుసంధానం చేస్తే మ‌రింత బాగుంటుంద‌ని భావిస్తున్నారు.