Begin typing your search above and press return to search.

మంగళవారం నుంచి మంటలేనట

By:  Tupaki Desk   |   5 Jun 2023 9:41 AM GMT
మంగళవారం నుంచి మంటలేనట
X
'మే'లో మండే మంటలు జూన్ వచ్చేసరికి ఆ తీవ్రత తగ్గుతుంది. జూన్ నెలలో ఐదో తారీఖు వచ్చింది. ఆదివారం అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు జల్లులు కురవటంతో వాతావరణం కూల్ కూల్ గా మారింది. గడిచిన కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలతో కిందామీదా పడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించిన పరిస్థితి.

ఆదివారం కురిసిన చిరుజల్లుల కారణంగా ఈ రోజు (సోమవారం) కాస్తంత చల్లటి వాతవరణం ఉండొచ్చని చెబుతున్న వాతావరణ నిపుణులు.. మంగళవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే.. రేపటి (మంగళవారం) నుంచి పగటి ఉష్ణోగ్రతలు మేలో మాదిరి మంటలు పుట్టించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

జూన్ వర్షాలు పడ్డాయి కాబట్టి.. వాతావరణ పరిస్థితులు మారతాయనుకునే వారు తప్పులో కాలేసినట్లేనని చెప్పాలి. ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడింది కానీ.. పగలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయి. దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు సాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా ఎండలు మండుతున్న పరిస్థితి. మరోవైపు నైరుతి రుతుపవనాల రాక సైతం ఆలస్యం కావటంతో.. వర్షాలకు మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

సాధారణంగా జూన్ ఒకటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి.. దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. దీంతో.. వానలు మొదలవుతాయి. కొన్నిసార్లు వీటి రాక వారం వరకు ఆలస్యమవుతుంది. గతంలో వేసిన అంచనాల ప్రకారం జూన్ నాలుగు నాటికి కేరళకు రుతుపవనాలు కేరళకు చేరాల్సి ఉంది. రుతుపవనాల రాకకు అన్నీ అనుకూల పరిస్థితులే ఉన్నాయని.. పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ ఆరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నట్లు చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే మరొ మూడు.. నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. అక్కడి నుంచి మనకు రావటానికి మరో ఐదు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. అంటే.. ఎండల తీవ్రత దగ్గర దగ్గర మరో వారం వరకు ఖాయమనే చెప్పాలి. సో.. మండే ఎండల విషయంలో కాస్తంత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.