Begin typing your search above and press return to search.

కొడుకుని కాపాడబోయి తెలుగు ఎన్నారై మృతి!

By:  Tupaki Desk   |   4 July 2023 5:56 AM GMT
కొడుకుని కాపాడబోయి తెలుగు ఎన్నారై మృతి!
X
జాక్సన్‌ విల్లే లోని మిక్లర్స్ బీచ్ సమీపంలో ఒక విషాదరకరమైన సంఘటన చోటుచేసుకుంది. రాజేష్ పొట్టి అని ముద్దుగా పిలుచుకునే వెంకట రాజేష్ కుమార్ పొట్టి ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌ విల్లే ఏరియా (TAJA) తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

అవును... అందరితో ఎంతో స్నేహపూర్వకంగా, వినయపూర్వకంగా ఉండే రాజేష్ (44) జూలై 1, 2023న విషాదకరమైన రీతిలో మృతి చెందారు.

జూలై 1 శనివారం రాజేష్, అతని కుటుంబంతో కలిసి మిక్లర్స్ బీచ్‌ లో సరదాగా గడుపుతుండగా ఈ సంఘటన జరిగింది. బీచ్ లో తన పిల్లలు నీటిలో ఆడుకుంటున్న సమయంలో రాజేష్ 12 ఏళ్ల కొడుకును బలమైన రిప్-కరెంట్ రాక్షస కెరటాలు కబలించే ప్రయత్నం చేశాయి. అది గమనించిన రాజేష్... తన కుమారున్ని రక్షించడానికి పరుగెత్తాడు.

ఈ సమయంలో తన కుమారుడిని రక్షించే ప్రయత్నంలో ఆ సాహస తండ్రి మృతి చెందారు. ఆయన కొడుకును వేగంగా వోల్ఫ్సన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌ కు తరలించారు. అతను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో ఉన్నాడని తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ లోని అద్దంకికి చెందిన రాజేష్... అమెరికా వెళ్లాలని కలకని అక్టోబర్ 1, 2022 న యునైటెడ్ స్టేట్స్‌ కు ప్రయాణమై వెళ్లారు. నాడు ఒంటరిగా వెళ్లిన ఆయన... మే 23, 2023న తన కుటుంబాన్ని కూడా అక్కడికి రప్పించుకున్నారు. రాజేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ వినాశకరమైన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, TAJA ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆ కుటుంబానికి సహాయం చేసే ఉద్దేశ్యంతో నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. రాజేష్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపే ప్రక్రియపూర్తి చేయడం, అంత్యక్రియల ఖర్చులు, వైద్య బిల్లులతోపాటు రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో భాగంగా ఈ నిధుల సేకరణ చేస్తున్నారు!

ఈ సందర్భంగా అసోసియేషన్ లోని ప్రతీ ఒక్కరు రాజేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడంతోపాటు ఆ కుటుంబానికి సహాయ పడాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా... అక్కడున్నవారికందరికీ TAJA... తన ప్రియమైనవారి శ్రేయస్సు కోసం అంతిమ త్యాగం చేసిన ధైర్యవంతుడి జ్ఞాపకాన్ని అంతా కలిసి గౌరవించుకుందాం అని ప్రకటించింది.