Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికల్లో కనిపించని తెలుగు నేతలు... ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   4 May 2023 11:16 AM GMT
కర్ణాటక ఎన్నికల్లో కనిపించని తెలుగు నేతలు... ఏం జరిగింది?
X
అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మే 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ, ఎట్టిపరిస్థితి లోనూ ఈ సారి గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలు ప్రచార ఈ హోరును పెంచాయి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఉత్తరాది రాష్ట్రాల కు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాత్రమే ఆయా పార్టీల తరఫున పెద్ద సంఖ్యలో ప్రచారం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి నేత‌లు ఎవరూ పెద్ద గా కనిపించడం లేదు. రాష్ట్రంలోని తమిళ ఓటర్లను ఆకట్టుకునేందు కు బీజేపీ కర్ణాటక మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అణ్ణామలై ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బెంగళూరులో స్థిరపడ్డ మలయాళీలను ఆకట్టుకునేందుకు కేరళ కు చెందిన బీజేపీ నేతలు సైతం తరలివచ్చారు.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓటర్ల ను ఆకర్షించేందుకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే, కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు వారిని ఆకర్షించేందుకు మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నామని పార్టీలు చెబుతున్నా ఆ ఊసు ఎక్కడా కనిపించడం లేదు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన తెలుగు నేతలు ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రం ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి దింపుతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా ఆయన కూడా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఇక, ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు ఆయన పర్యటన పై ఎలాంటి సమాచారం లేదని, ఆయన షెడ్యూల్ కూడా ఖరారు కాలేదని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలు కూడా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి రెండు రోజులు పర్యటించి వెళ్లిపోయారు. దీంతో కర్ణాటక లోని తెలుగు వారిని ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పెద్దగా ప్రయత్నించలేదనే వాదన వినిపిస్తోంది.