Begin typing your search above and press return to search.

న‌మ్మిన బంటు న‌మ్మ‌క ద్రోహం... తెలంగాణ‌లో టీడీపీకి శ‌రాఘాతం

By:  Tupaki Desk   |   8 April 2021 3:30 AM GMT
న‌మ్మిన బంటు న‌మ్మ‌క ద్రోహం... తెలంగాణ‌లో టీడీపీకి శ‌రాఘాతం
X
నిజ‌మే... తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఇందుకు ప్ర‌త్య‌ర్థులో, ఆ పార్టీ అంటే గిట్ట‌ని వారో కార‌ణం కాదు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడుకు అత్యంత విశ్వ‌స‌నీయుడిగా, పార్టీకి న‌మ్మిన బంటుగా పేరుగాంచిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావే కార‌ణంగా నిలిచారు. టీడీపీ టికెట్ పై పోటీ చేసి... టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించిన మెచ్చా... తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా లొంగ‌లేదు క‌దా... పార్టీకి, పార్టీ అధినేత‌కు తాను ఎంత న‌మ్మిన బంటున‌న్న విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పుకువ‌చ్చారు. అలాంటి మెచ్చానే ఇప్పుడు త‌న‌కు రాజ‌కీయ బిక్ష పెట్టిన టీడీపీకి రాజీనామా చేశారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో టీడీపీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించేశారు. వెర‌సి తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ పేరు క‌నుమ‌రుగ‌య్యేలా చేశారు.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటైన త‌ర్వాత టీడీపీకి కొత్త రాష్ట్రంలో మెరుగైన ఫ‌లితాలే సాధించింది. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కార‌ణంగా ఒక్కొక్క‌రే టీడీపీని వీడి గులాబీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నిక‌లు జ‌రిగేనాటికి టీడీపీ బాగా బ‌ల‌హీన‌ప‌డిన‌ప్ప‌టికీ... కొన్ని స్థానాల్లో మాత్రం గ‌ట్టిగానే నిల‌బ‌డింది. ఆ ఫ‌లితంగానే అశ్వారావుపేట‌లో మెచ్చా నాగేశ్వ‌ర‌రావు, స‌త్తుప‌ల్లి నుంచి సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు టీడీపీ ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. అయితే మ‌రోమారు టీఆర్ఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ కు సండ్ర లొంగిపోయారు. టీడీపీకి రాజీనామా చేయ‌కుండానే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీఎల్పీకి ఒక్క మెచ్చా మాత్ర‌మే మిగిలిపోయారు. మెచ్చాను కూడా లాగేసేందుకు టీఆర్ఎస్ చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌న్న వాద‌న‌లు కూడా వినిపించాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ తో ఓసారి మెచ్చా భేటీ కూడా అయ్యారు. దీంతో టీఆర్ఎస్ లోకి మెచ్చా చేరిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వార్త‌లు వినిపించాయి.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఆయ‌న‌తో భేటీ అయిన మెచ్చా... తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేద‌ని, త‌న‌కు రాజ‌కీయ బిక్ష పెట్టిన టీడీపీని వీడేది లేద‌ని కూడా గ‌ట్టిగానే చెప్పారు. బ‌య‌ట‌కు ఇలా క‌నిపించినా... తెర వెనుక ఏ మేర తంతు నడిచిందో తెలియ‌దు గానీ... టీడీపీకి న‌మ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న మెచ్చా... టీడీపీకి రాజీనామా చేసేశారు. టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ వెంట‌నే స్పీకర్‌ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. ఈ లేఖ‌కు స్పీక‌ర్ త్వ‌ర‌లోనే ఆమెద ముద్ర వేయ‌డం ఖాయ‌మేన‌ని చెప్పాలి. అంటే... ఇక‌పై తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ పేరు క‌నుమ‌రుగైన‌ట్టే. మ‌ళ్లీ 2023లో తెలంగాణ‌కు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ పై ఎవ‌రైనా ఎమ్మెల్యేగా గెలిస్తే త‌ప్పించి తెలంగాణ అసెంబ్లీఓ టీడీఎల్పీ పేరు విన‌బ‌డేలా లేదు.