Begin typing your search above and press return to search.

తెలుగు ముఖ్యమంత్రులు.. టెన్త్ పరీక్షల్లో ఆ స్టేట్ ను ఫాలో కండి

By:  Tupaki Desk   |   4 Jan 2021 4:10 AM
తెలుగు ముఖ్యమంత్రులు.. టెన్త్ పరీక్షల్లో ఆ స్టేట్ ను ఫాలో కండి
X
కరోనా భయం ఇప్పుడు కాస్త తగ్గింది. కేసుల నమోదులో క్షీణత చోటు చేసుకోవటం.. వ్యాక్సిన్ వచ్చేసిందన్న మాట వారిలో బెరుకును తగ్గిస్తోంది. దాదాపుగా పది నెలల పాటు బిక్కుబిక్కుమంటూ బతికిన వారు కొంతకాలంగా తప్పనిసరి పరిస్థితుల్లో పనులకు వెళ్లాల్సి రావటం.. బయట తిరగాల్సిన పరిస్థితి. పెద్దల పరిస్థితి ఇలా ఉంటే.. పిల్లల పరిస్థితి మరోలా ఉంది. ఉదయాన్నే లేచి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కావటం.. కరోనా తీసుకొచ్చిన కొత్త విద్యా విధానంతో వారు కిందామీదా పడుతూ ప్రిపేర్ అవుతున్నారు. ఆన్ లైన్ లోనే పరీక్షలు రాస్తున్నారు.

ఏపీలో కాలేజీలు.. స్కూళ్లు ఓపెన్ చేసినా.. తెలంగాణలో మాత్రం బడులు తెరవలేదు. మిగిలిన తరగతుల విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా.. టెన్త్.. ఇంటర్ సెకండ్ ఇయర్.. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఫైనల్ ఇయర్ మొత్తం ఆన్ లైన్ క్లాసులతో నడిపించేయటం.. వారి చదువు మీద తీవ్ర ప్రభావం పడిన పరిస్థితి. మార్కుల విషయంలో తేడా కొడితే..తమ ఫ్యూచర్ మీద ప్రభావం పడుతుందన్న భయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. ఒడిశా ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది.

పెద్ద మనసుతో చేసుకొని పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విన్నంతనే ఎగిరి గంతేసే తీపి కబురు చెప్పటంతో పాటు.. పరీక్షలు ఎప్పుడు పెడతారా? అని ఎదురుచూసేలా నిర్ణయం తీసుకుంది. ఇంతకూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం ఏమంటే.. పదో తరగతి పరీక్ష ఈసారి వంద మార్కులకు కాకుండా 80 మార్కులకే పెడతారు.

పరీక్షలో వచ్చిన మార్కులకు 20 మార్కుల్ని కలిపేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో క్లాసులు సరిగా జరగకపోవటం.. ఆన్ లైన్ లో పిల్లలు కుస్తీ పడిన నేపథ్యంలో.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల మీద అనవసరమైన భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. 80 మార్కుల పరీక్షలోనూ 50 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఉండనున్నాయి. మిగిలిన 30 మార్కులు ఇతర ప్రశ్నలు.. సమాధానాలు ఉంటాయని చెబుతున్నారు. పిల్లలు.. వారి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీలయ్యే ఈ తరహా నిర్ణయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.