Begin typing your search above and press return to search.

ఏపీలో ఇలా చేస్తారు..తెలంగాణ‌లో మాత్రం క‌నిపించ‌దే!

By:  Tupaki Desk   |   9 March 2019 5:18 AM GMT
ఏపీలో ఇలా చేస్తారు..తెలంగాణ‌లో మాత్రం క‌నిపించ‌దే!
X
తెలంగాణ ఉద్య‌మంలో బ‌లంగా వినిపించిన మాట‌.. విడిపోయి క‌లిసి ఉందామ‌ని. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉందామ‌ని.. ఎవ‌రికి వారు మ‌రింత బ‌ల‌ప‌డ‌దామ‌న్న మాటను చెప్పేవారు. విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన ఏపీ వారు.. విభ‌జ‌న జ‌రిగింద‌న్న వాస్త‌వాన్ని జీర్ణించుకుంటూనే.. విభ‌జ‌న క‌ష్ట‌న‌ష్టాల‌పై నింద‌లు వేయ‌కుండా త‌మ దారిన తాము బ‌తుకుతున్న ప‌రిస్థితి.

అదే స‌మ‌యంలో.. తెలంగాణ వారి ప‌ట్ల మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. వారిని ప్రేమ‌తో అక్కున చేర్చుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. తెలంగాణ‌లోనూ ఆంధ్రా వారి ప‌ట్ల ద్వేష భావం క‌నిపించ‌దు. అయితే.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. కొన్ని ప్రాంతాల్లోనూ.. ఉద్యోగాల విష‌యంలోనూ తెలంగాణ‌.. ఆంధ్రా అన్న మాట‌లు అప్పుడ‌ప్పుడు వినిపిస్తూ ఉంటాయి.

ఎక్క‌డి దాకానో ఎందుకు? తెలంగాణ అధికార‌ప‌క్షానికి చెందిన మీడియా సంస్థ‌ల్లో ఏపీకి చెందిన వారికి ఉపాధి అవ‌కాశాలు ఉండ‌వన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

అంతేనా.. హైద‌రాబాద్ లో సెటిల్ అయిన వారికి అవ‌కాశం ఇచ్చేందుకు స‌సేమిరా అనే ప‌రిస్థితి. మీ కాలికి ముల్లు త‌గిలితే నా పంటితో తీస్తాన‌ని కేసీఆర్ చెప్పే మాట‌ల‌కు.. తన సొంత సంస్థ‌లో మాత్రం అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌టం ఏమిట‌న్న మాట‌ను కొంద‌రు తెర మీద‌కు తెస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఏపీలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు త‌మ వ‌ద్ద ప‌ని చేస్తుంటే.. వారికి ప్ర‌త్యేక గుర్తింపును ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా ఇలాంటి ఉదంత‌మే ఒక‌టి వార్తాంశంగా మారింది. త‌మ కాలేజీలో చ‌దువుకొని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు రాజ‌కీయాల్లో వ‌చ్చిన ఒక తెలంగాణ మ‌హిళ‌ను ఏపీలో స‌న్మానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఉండ‌వ‌ల్లి మండ‌లం బొంకూరుకు చెందిన శ్రీ‌ల‌త అనే మ‌హిళ ఇటీవ‌ల జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ గా విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆమె ఏపీలోని క‌ర్నూలు జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీలో చ‌దువుకున్నారు. తాజాగా జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమెను ప్ర‌త్యేకంగా పిలిపించి క‌ళాశాల‌లో స‌త్క‌రించారు. మ‌రికొంద‌రు మ‌హిళ‌ల్ని కూడా స‌త్క‌రించారు. ఇదే రీతిలో తెలంగాణ‌లోనూ ఏపీకి చెందిన వారు.. హైద‌రాబాద్ లో సెటిల్ అయిన వారిని ప్ర‌త్యేకంగా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. విడిపోయి క‌లిసి ఉండ‌టం అనే నినాదానికి అస‌లుసిస‌లు అర్థం ఇదే క‌దా!