Begin typing your search above and press return to search.

శభాష్‌.. కరోనా కట్టడికి మహిళా సర్పంచ్‌ గస్తీ

By:  Tupaki Desk   |   25 March 2020 12:10 PM GMT
శభాష్‌.. కరోనా కట్టడికి మహిళా సర్పంచ్‌ గస్తీ
X
కరోనా కట్టడికి తెలంగాణ అంతా లాక్‌ డౌన్‌ ప్రకటించగా ప్రజలు యథేచ్ఛగా తిరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులందరూ రంగంలోకి దిగి ప్రతి ఒక్కరూ లాక్‌ డౌన్‌ పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధి భాగస్వాములు కావాలని అలా కేసీఆర్‌ పిలుపునివ్వడంతో ఇలా ఓ యువ మహిళా సర్పంచ్‌ అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఉగాది పండుగ పూట గ్రామ సరిహద్దు మూసివేసి కాపలాగా నిలబడి శభాష్‌ అనిపించుకుంటున్నారు.

ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురంలో జరిగింది. ఆ గ్రామ సర్పంచ్‌ ఉడుత అఖిల యాదవ్‌ తెలంగాణలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్‌. లాక్‌ డౌన్‌ సందర్భంగా రాకపోకలు నిషేధిస్తూ గ్రామ రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి గ్రామంలోకి ఎవరూ రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కర్ర పట్టుకుని కాపు కాశారు. ఈ సందర్భంగా ఆమె కూడా జాగ్రత్తలు పాటించారు. ముఖానికి గుడ్డ కట్టుకుని.. కర్ర చేత పట్టుకొని గ్రామ పొలిమేరలో నిల్చున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా తమ గ్రామంలోకి కరోనా మహమ్మారి రాకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను సోషల్‌ మీడియాలో అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా మా ఊరికి మీరు రావొద్దు.. మీ ఊరికి మేము రాము అంటూ బోర్డులు పెట్టేసి రాకపోకలు నిషేధం విధించుకుంటున్నారు.